బడ్జెట్‌లో సినీ కార్మికులకు నిధిని కేటాయించాలని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని ఫెఫ్సీ ఆవరణలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారత సినీ కార్మికుల పరిస్థితి ఇప్పటికీ శ్రమ, ప్రమాదాలతోనే నిండిపోయిందన్నారు. మూడేళ్లకోసారి సినీ నిర్మాతలతోనూ, బుల్లితెర నిర్మాతలతోనూ చర్చలు జరుపుతూ కార్మికుల వేతనాలను కొంచెం పెంచుకుందామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం కిందిస్థాయి కార్మికుల దాకా చేరడం లేదన్నారు. అదేవిధంగా షూటింగ్‌లో పనిచేసే కార్మికుల్లో ఇప్పటి వరకు 100కు పైగా ప్రమాదాల్లో మరణించారని, రజనీకాంత్ కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ మరణించే వారి కుటుంబాలకు మాత్రమే కాస్త సాయం అందుతుందని తెలిపారు.
చిన్న చిత్రాల్లో ప్రమాదానికి గురైన వారికి ఎలాంటి సాయం అందట్లేదని పేర్కొన్నారు. సినీ కార్మికుల సాయం కోసం రానున్న వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం కొంత నిధిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 2010లో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కార్మికుల ఇళ్ల కోసం పైయనూర్‌లో స్థలాన్ని కేటాయించారని, అక్కడ స్టూడియోలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దానికి కలైంజర్ అనే పేరుతో ఆయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటికి ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరారు. లైట్‌మెన్లకు సాయం కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిధిని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారని, అదేవిధంగా తమ సమాఖ్యలోని ఇతర కార్మికులకు సాయం అందించడానికి నిర్మాతలు, ప్రముఖ నటులు, సాంకేతిక నిపుణులు ముందుకు వస్తే బాగుంటుందని ఆర్కే సెల్వమణి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment