ముంబై: పాపులర్ నటుడు మధుర్ మిట్టల్ మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ప్రియురాలి మీద లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు దాడి చేసి గాయపర్చినందుకుగానూ అతడిపై ఈ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 13న మిట్టల్ అతడి మాజీ ప్రియురాలి ఇంట్లోకి చొరబడి దుర్భాషలాడాడు. ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు దాడికి దిగాడు. బాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితుడు పూటుగా తాగి, ఆ మైకంలో బాధితురాలి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. ఆ సమయంలో అతడు బాధితురాలిని 15 సార్లు గొంతు పిసికి, ఆమె జుట్టు పట్టుకుని లాగి, కుడికన్ను మీద పిడిగుద్దులు కురిపిస్తూ ఇష్టమొచ్చినట్లు కొట్టాడని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందే వీళ్లిద్దరూ విడిపోయారని తెలిపారు. ఫిబ్రవరి 15న కూడా మరోసారి ఆమె ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడని, కానీ తానే స్వయంగా మిట్టల్‌ను అడ్డుకున్నట్లు తెలిపారు.
కాగా మధుర్ మిట్టల్ 'షకలక బూమ్ బూమ్' అనే టీవీ షోలో బాలనటుడిగా కనిపించాడు. ఆ తర్వాత 'స్లమ్‌డాగ్ మిలియనీర్'లో అద్భుత నటన కనబర్చాడు. వీటితో పాటు మిలియన్ డాలర్ ఆర్మ్, మాత్ర్ సినిమాల్లోనూ నటించాడు. ప్రస్తుతం అతడు వెబ్ సిరీస్ షూటింగ్ నిమిత్తం జైపూర్‌లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment