స్టార్ హీరోల సినిమాను ఫస్ట్‌డే ఫస్ట్ షో చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అందుకోసం చాలా కష్టపడతారు. ఇప్పుడైతే ఆన్‌లైన్‌లో టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి కానీ.. అప్పట్లో అయితే ఎవరైనా థియేటర్‌కి వెళ్లి టికెట్ కొనాల్సిందే. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఫస్ట్‌డే ఫస్ట్ షో అనుభవం ఉందట. ఎన్టీఆర్ రామారావు సినిమా ఫస్ట్ షోకి వెళ్లి నాన్న చేతిలో దెబ్బలు తిన్నాడట. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు జంటగా వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన ఫస్డ్ డే ఫస్ట్ షో అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకొని నవ్వులు పూయించారు.
‘నాకు కూడా ఫస్డ్ డే ఫస్ట్ షో అనుభవం ఉంది. అయితే ఎప్పుడూ.. ఎక్కడా చెప్పుకోలేదు. ఎందుకంటే పరువు పోతుందేమో అని (నవ్వుతూ). నెల్లూరులో మా చుట్టాలబ్బాయి పూర్ణ అనేవాడు ఉండేవాడు. వాడికి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. వాడితో కలిసి ఏవీఎమ్ వారి రాము సినిమాకు వెళ్లాం. నాన్నగారు మమ్మల్ని నేల, బెంచ్ కాకపోయినా.. కాస్త కుర్చీ రేంజ్‌లోనే సినిమాలు చూపించేవారు. కానీ ఆ రోజు నేలకు వెళ్లాల్సి వచ్చింది.
(చదవండి: అప్పుడే సినీ పరిశ్రమ విలువేంటో తెలిసింది)
నాతో పాటు తమ్ముడు నాగబాబు కూడా సినిమాకు వచ్చాడు. అప్పుడు నాగబాబు ఎర్రగా ఉండేవాడు. ఇరుకు గోడలు, అందరు కొట్టుకున్నారు. చెమటలు కక్కుతూ టికెట్ కోసం లోపలికి వెళ్తే.. మధ్యలో క్యూ ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయేంత పనైపోయింది. లోపలికి వెళ్లలేం..అలా అని బయటకు రాలేం. అందరిని పక్కకి నెడుతూ.. టికెట్లు తీసుకొని బయటకు వచ్చేసరికి మా నాన్న ఉన్నాడు.
ఆయన అదే థియేటర్‌లో అంతకు ముందు షో చూసి వస్తున్నారు. అమ్మ కూడా ఉంది. తమ్ముడు నాగబాబు నలిగిపోయి, వెర్రిముఖం వేసుకొని ఉన్నాడు. నాన్న అక్కడ స్థంభానికి కట్టిన కొబ్బరి ఆకు నుంచి కొబ్బరి మట్ట పీకీ.. ‘నేల టికెట్‌కి వెళ్తారా.. తమ్ముడు చచ్చిపోతే ఎలా? అంటూ థియేటర్ నుంచి ఇంటిదాకా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అందుకే ఇప్పటికీ ఏవీఎమ్ రాము అంటే నాకు షివరింగ్ వచ్చేస్తుంది’అంటూ చిరంజీవి తన అనుభవాన్ని పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment