సుశాంత్, చిరంజీవి, కీర్తీ సురేశ్, అనిల్ సుంకర, మెహర్ రమేష్
‘‘రీమేక్స్ చేస్తారేంటి? అని అంటుంటారు. మంచి కంటెంట్‌ని తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే ప్రయత్నం మన యాక్టర్స్, దర్శకులు చేస్తే తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. ‘వేదాళం’ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో లేదు. ఎవరూ చూసి ఉండరు. ఆ ధైర్యంతోనే మెహర్, అనిల్ నా వద్దకు రావడంతో ‘భోళాశంకర్’ చేశాను’’ అని చిరంజీవి అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘భోళాశంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘భోళాశంకర్’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘భోళాశంకర్’ సినిమా నాకు నచ్చింది కాబట్టే చేశాను. మీకు (ప్రేక్షకులు) కూడా నచ్చుతుందనే ధైర్యంతో విడుదల చేస్తున్నాం. స్వయంకృషితో మెహర్ రమేశ్ దర్శకుడిగా ఎదిగాడు. కొత్తవారి ప్రతిభతో ఇండస్ట్రీ మరింత ఎదగాలి. ఇండస్ట్రీని నమ్ముకుని వస్తే గొప్ప లైఫ్‌ని ప్రసాదిస్తుంది. ఇండస్ట్రీ పుష్పక విమానంలాంటిది.. ఎంతమంది వచ్చినా ఇంకా చోటు మిగిలే ఉంటుంది.
ఇండస్ట్రీ అక్షయ పాత్రలాంటిది. ఎంతమంది తిన్నా కూడా ఇంకా భోజనం అందిస్తుంది ఈ కళామతల్లి. కేవలం స్టార్స్ మాత్రమే ఉండే ఈ ఇండస్ట్రీలోకి బిక్కు బిక్కు మంటూ నేను ప్రవేశించాను. నా ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. నా లోపల ధైర్యం ఉంది. ‘కొత్త అల్లుడు’ సినిమాలో ఓ చిన్న వేషం వేయమన్నారు.. బాధగా అనిపించింది కానీ చేశాను. అలాగే ‘కొత్తపేట రౌడీ’ సినిమాలో కృష్ణగారి పక్కన చిన్న వేషం వేయమన్నారు. ఓ వైపు ‘శుభలేఖ’, ‘ఇంట్లో కృష్ణయ్య వీధిలో రామయ్య’ వంటి సినిమాలు చేస్తున్నాను.. ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తే బాగుంటుందా? అంటే.. ‘చేయండి సార్’ అన్నారు.
చేయనంటే నా భవిష్యత్ మీద ప్రభావం పడుతుందేమో అనే భయంతో చేశాను. కానీ, ఈ ఇండస్ట్రీ నన్ను ఆదరించిన దానికంటే... నన్ను ప్రోత్సహించి, భుజాన ఎత్తుకుంది, పైకి లేపింది ప్రేక్షకులు. వారికి రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘మీరంతా (అభిమానులు) చిరంజీవిగారి సినిమాలు చూస్తూ పెరిగితే.. నేను చిరంజీవిగారితో సినిమాలు చేస్తూ పెరిగాను’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్ . ‘‘చిరంజీవిగారితో సినిమా చేయడాన్ని లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు అనిల్ సుంకర్. ‘‘ఒక షాడోలో ఉన్న నా మీద మెగాస్టార్ అన్నయ్య వెలుగు పడింది. ‘భోళా శంకర్’ నాకు దర్శకుడిగా పునర్జన్మలాంటిది’’ అన్నారు. ఈ వేడుకలో పలువురు దర్శక– నిర్మాతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment