ఇండియన్ సినిమాకు అరుదైన ఘనత.. దాదాపు 30 ఏళ్ల తర్వాత! | Sakshi
Sakshi News home page

All We Imagine as Light: ఇండియన్ సినిమాకు అరుదైన ఘనత.. దాదాపు 30 ఏళ్ల తర్వాత!

Published Fri, Apr 12 2024 12:28 PM

First Indian film to compete at Cannes in After 30 years All We Imagine as Light - Sakshi

ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారి ఇండియన్ సినిమాకు చోటు లభించింది. పాయల్ కపాడియా డైరెక్షన్‌లో తెరకెక్కించిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' కేన్స్‌లో పామ్ డి ఓర్ అవార్డుకు నామినేట్ అయింది. పాయల కపాడియా తెరకెక్కించిన మొదటి ఫిక్షన్‌ చిత్రమిది. ఈ ఏడాది మే 14 నుంచి 25 వరకు జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యున్నత పురస్కారాల కోసం పోటీలో నిలిచింది. దాదాపుగా పామ్ డి ఓర్ అవార్డు కోసం పోటీ పడుతున్న మొదటి భారతీయ చిత్రం ఇదే కావడం గమనార్హం. 

కాగా.. గతంలో 1994లో షాజీ ఎన్ కరుణ్ తెరకెక్కించిన 'స్వహం' మూవీ కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాలతో కపాడియా 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' పోటీ పడుతోంది. ఈ ఏడాది జరగనున్న కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కు జ్యూరీకి 'లేడీబర్డ్', 'బార్బీ' డైరెక్టర్ గ్రెటా గెర్విగ్ అధ్యక్షత వహించనున్నారు.

అంతే కాకుండా బ్రిటీష్-ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి చిత్రం 'సంతోష్' కూడా అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగానికి ఎంపికైంది. కాగా.. గతంలో పాయల్ కపాడియా డాక్యుమెంటరీ 'ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్' 2021 ఎడిషన్‌లో ఉత్తమ డాక్యుమెంటరీగా గోల్డెన్ ఐ అవార్డ్‌ను గెలుచుకుంది. 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' అనే మూవీని ఒక నర్సు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు  ఎంపికైన భారతీయ చిత్రాలలో చేతన్ ఆనంద్, వి శాంతారామ్, రాజ్ కపూర్, సత్యజిత్ రే, ఎంఎస్ సత్యు, మృణాల్ సేన్ రచనలు ఉన్నాయి. 'నీచా నగర్' పామ్ అవార్డ్‌ గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది. 

Advertisement
Advertisement