వెస్ట్ ఇండీస్ క్రికెటర్.. అరుదైన ఆల్‌రౌండర్స్‌లో ఒకడు.. గ్యారీ సోబర్స్!
సిల్వర్ స్క్రీన్ గ్లామర్.. టాలెంట్‌లో ది బెస్ట్.. అంజు మహేంద్రు!
ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. కానీ పెళ్లితో జత కట్టలేకపోయారు. కలవని ఆ ప్రేమ కథ గురించి..
పేజ్ త్రీ సర్కిల్ పార్టీల్లో క్రికెట్, సినిమా స్టార్స్ కలసుకోవడం సర్వసాధారణం. అలాంటి పార్టీలోనే అంజు మహేంద్రును కలిశాడు గ్యారీ సోబర్స్. తొలి చూపులోనే ఆమె అతణ్ణి ఆకట్టుకుంది. ‘హాయ్.. నేను గ్యారీ’ అంటూ ఆమె దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నాడు. ‘ఎస్.. ఐ నో.. మై నేమ్ ఈజ్ అంజు.. అంజు మహేంద్రు.. ఫిల్మ్ యాక్ట్రెస్’ అంటూ కరచాలనం చేసింది. ‘ఐ నో!’ అంటూ నవ్వి.. ‘నాతో డాన్స్ చేస్తావా అన్నట్టుగా ‘డాన్స్..?’ అంటూ తన చేయి అందించాడు ఆమెకు. ‘వై నాట్.. ’అంటూ అతని చేయి అందుకొని అతనితో అడుగులు కదిపింది. ఆ ఇద్దరి డాన్స్‌కు అందరూ కళ్లప్పగించారు. ఆ రోజు ఆ పార్టీలో ఆ జంటే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయింది. గ్యారీతో అంజు స్నేహం కంటిన్యూ అయింది.
అప్పుడు అంజుకి ఇరవై ఏళ్లు. అప్పటికే రాజేశ్ ఖన్నాతో ప్రేమలో ఉంది.. స్పర్థలూ మొదలయ్యాయి. అంజుని హీరోయిన్‌గా ప్రోత్సహించినట్టే ప్రోత్సహించి.. ఆమెకు అవకాశాలు రావడంతోనే తనకున్న పొజెసివ్ నేచర్‌ను ప్రదర్శించడం మొదలుపెట్టాడు రాజేశ్ ఖన్నా. ఆ తీరుతో విసిగి వేసారిపోయున్న అంజుకి గ్యారీ ఫ్రెండ్‌షిప్‌తో సాంత్వన దొరికింది. ఇది 1966 నాటి సంగతి. ఆ సమయంలో ఇండియాతో మ్యాచ్ ఆడ్డానికి ఇక్కడికి వచ్చింది వెస్ట్ ఇండీస్ టీమ్. ఆ టూర్ అంతా గ్యారీ .. అంజుతోనే కలసి ఉన్నాడు. మ్యాచ్ అయిపోగానే హ్యాంగవుట్‌లు, డిన్నర్‌లు, పార్టీలు పరిపాటయ్యాయి ఆ జంటకి. వెస్ట్ ఇండీస్ టీమ్ ఇండియా టూర్ ముగిసే సమయానికి అంజు ప్రేమలో మునిగిపోయాడు గ్యారీ. ఆ ఇద్దరికీ నిశ్చితార్థమూ జరిగింది అంజు వాళ్ల కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో (గ్యారీ సోబర్స్ ఆటోబయోగ్రఫీ ప్రకారం). ఇద్దరి షెడ్యూల్స్‌లోని వీలు ప్రకారం పెళ్లికి తేదీ నిర్ణయించుకోవాలను కున్నారు. ఆలోపు సొంత దేశానికి వెళ్లిపోయాడు గ్యారీ.
అక్కడ గ్యారీ ఉత్తరప్రత్యుత్తరాలు.. టెలిఫోన్ సంభాషణలతో అంజుతో అనుబంధం కొనసాగించాడు. కొన్నాళ్లు గడిచాక.. మ్యాచ్‌లతో, క్రికెట్ టూర్లతో బిజీ అయిపోయాడు. అంజును పూర్తిగా మరచిపోకపోయినా ఆమె ఆలోచన మాత్రం వెనక్కి వెళ్లిపోయింది. ఆ క్రమంలోనే అతను ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ ప్రు కిర్బీ అనే అమ్మాయిని కలిశాడు. ఆ ఆకర్షణలో పడ్డాడు. అది లవ్వై.. మ్యారేజ్ వరకూ వెళ్లింది.
అప్పుడు..అంజుకి ఫోన్ చేశాడు గ్యారీ. ‘అంజు.. ఐ యామ్ రియల్లీ సారీ.. ప్రు అని.. ఆస్ట్రేలియన్.. వి ఆర్ ఇన్ లవ్. వాన్న గెట్ మ్యారీ!’ అని ఆగాడు. అవతల నుంచి అంజు ఉఛ్వాస..నిశ్వాసాలే వినపడుతున్నాయి. గ్యారీ మనసులో ఏదో బాధ.. ‘హలో.. అంజు..’ పిలిచాడు. అతని స్వరంలో అపరాధ భావం స్పష్టంగా! ‘ఎస్ గ్యారీ..’ గొంతు పెగల్చుకుని పలికింది అంజు. ‘ఐ యామ్ సారీ డియర్.. ’ గ్యారీ. ‘వాట్ కెన్ ఐ డు ఫర్ యూ నౌ’ అని అడిగింది. ‘నీడ్ యువర్ కన్‌సెంట్ టు మ్యారీ ప్రు’ చెప్పాడు గ్యారీ. ‘ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ గ్యారీ’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది అంజు. పొగిలి పొగిలి ఏడ్చింది. అవతల గ్యారీ కూడా.. ‘ప్లీజ్ ఫర్ గివ్ మీ డియర్’ అంటూ ఏడ్చేసి అపరాధ భారం దించేసుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ ప్రు కిర్బీని గ్యారీ పెళ్లి చేసుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని రాతపూర్వకమైన సమ్మతినీ తెలియజేసింది అంజు మహేంద్రు. గ్యారీ, ప్రుల పెళ్లి అయిపోయింది. అంజు ఒంటరిగానే మిగిలిపోయింది.
‘అంజు చాలా మంచి అమ్మాయి. ఆమెను మనసావాచా ఇష్టపడ్డాను. ఇద్దరం కలసి ఇంగ్లండ్ వెళ్లి అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తను నాతో వచ్చేయడానికి ఉవ్విళ్లూరింది. అలా ఇంగ్లండ్ వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడానికి ఆ టైమ్‌లో నేను ఆమె పేరు మీద రిజర్వ్ బ్యాంక్‌లో కొంత డబ్బును డిపాజిట్ చేయాలనే నియమం ఏదో ఉన్నట్టుంది. అదేంటో నాకర్థం కాలేదు. ఇండియా వదిలి వచ్చేశాను. తర్వాత తనూ వచ్చేద్దామనుకుంది. కానీ చివరి నిమిషంలో ఆగిపోయింది. మా రిలేషన్‌షిప్ బ్రేక్ అవడానికి ఆ దూరమే కారణం అనుకుంటున్నాను!’ – గ్యారీ సోబర్స్ (‘గ్యారీ సోబర్స్: మై ఆటోబయోగ్రఫీ’ నుంచి)
-ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment