‘‘ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రపంచం, సినిమా పరిశ్రమ చిన్నవి అయిపోయాయి. ఇతర భాషల సినిమాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే సినిమాకు భాష లేదు. ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ చిత్రంలో కొన్ని పాత్రలు హిందీ మాట్లాడతాయి. ఈ డైలాగ్స్ ప్రేక్షకులకు అర్థం కాకపోయినా భావం అర్థం అవుతుంది’’ అని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అన్నారు. శింబు కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘వెందు తనిందదు కాడు’. సిద్ధీ ఇద్నాని కథానాయిక. ఇషారి.కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాను ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ టైటిల్‌తో శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ ఈ నెల 17న తెలుగులో విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా గౌతమ్ మీనన్ మాట్లాడుతూ–‘‘పల్లెటూరులో జీవించే ముత్తు ముంబై వెళ్లి, అనుకోకుండా చీకటి ప్రపంచంలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఎలా బయట పడ్డాడు? అన్నదే కథ. రెహమాన్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కథ డిమాండ్ చేయడంతోనే ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నాం. ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ను తెలుగులో ‘స్రవంతి’ రవికిశోర్‌గారు విడుదల చేయడం హ్యాపీ. నేను, రామ్ చేయాలనుకుంటున్న మూవీ వేసవి తర్వాత ఉండొచ్చు. కమల్‌హాసన్‌గారితో ‘రాఘవన్ 2’ చేయాలనే ప్లాన్ ఉంది. వెంకటేష్‌గారితో ‘ఘర్షణ 2’, నాగచైతన్యతే ‘ఏ మాయ చేసావె 2’ చేయాలనుంది. విక్రమ్‌తో నేను తీసిన ‘ధృవనక్షత్రం’ ఈ డిసెంబరులో రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment