టైటిల్: గీతాంజలి మళ్ళీ వచ్చింది
నటీనటులు: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు
నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ
కథ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్
దర్శకత్వం: శివ తుర్లపాటి
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
విడుదల తేది: ఏప్రిల్ 11, 2024
తెలుగు బ్యూటీ అంజలి కెరీర్‌లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ‘గీతాంజలి’ సినిమా ఒకటి. పదేళ్ల క్రితం వచ్చిన ఈ కామెడీ హారర్ అప్పట్లో ఘన విజయం సాధించింది. దశాబ్దం తర్వాత మళ్లీ అదే టీమ్‌తో గీతాంజలికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గీతాంజలి తరహాలో సీక్వెల్ కూడా హిట్ అయినట్లేనా? లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
దర్శకుడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో మరో అవకాశం రాదు. సినిమా చాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి స్నేహితులు ఆరుద్ర(షకలక శంకర్), ఆత్రేయ(సత్యం రాజేశ్)కలిసి హైదరాబాద్‌లో కష్టపడుతుంటాడు. మరోవైపు వైజాగ్‌లో ఫాస్ట్‌పుడ్ సెంటర్ నడుపుకునే అయాన్(సత్య) హీరో కావాలనని కలలు కంటుంటాడు. అయాన్‌ని హీరో చేస్తానని నమ్మించి అతని నుంచి డబ్బులు వసూలు చేస్తాడు శ్రీనివాస్. ఫ్రెండ్‌పై నమ్మకంతో హైదరాబాద్ వస్తాడు అయాన్. ఇక్కడకు వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. మోస పోయానని తెలిసినా శ్రీనివాస్ పరిస్థితి చూసి ఏమి అనలేకపోతాడు.
ఇక సినిమా ఇండస్ట్రీని వదిలేసి వేరే ఏదైనా పని చేసుకుందాని శ్రీనివాస్ గ్యాంగ్‌తో పాటు అయాన్ కూడా నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఊటికి చెందిన పెద్ద వ్యాపారవేత్త విష్ణు( రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా(శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి శ్రీనివాస్‌కి ఫోన్ కాల్ వస్తుంది. అతనితో ఓ సినిమాను నిర్మిస్తానని విష్ణు చెబుతాడు. హీరోయిన్‌గా ఊటీలోనే కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అలాగే షూటింగ్ అంతా సంగీత్ మహాల్‌లోనే చేయాలని కండీషన్ పెడతాడు. ఆ మహాల్ చరిత్ర ఏంటి? ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలలో శ్రీను టీమ్‌కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సినిమా షూటింగ్‌ని అక్కడే చేయాలని విష్ణు ఎందుకు కండీషన్ పెట్టాడు? హ్యాట్రిప్ ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనుతో విష్ణు ఎందుకు సినిమా తీయాలనుకున్నాడు? హీరోయిన్‌గా అంజలినే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ కథలోకి గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
హారర్ కామెడీ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. పదేళ్ల కిందట వచ్చిన గీతాంజలి ముందు కూడా ఈ జానర్‌లో సినిమాలు వచ్చాయి. కానీ గీతాంజలి తరహాలో అవి విజయం సాధించలేకపోయాయి. ఆ చిత్రం విజయానికి ప్రధాన కారణం కామెడీ, హారర్‌తో పాటు ఎమోషన్స్ కూడా చక్కగా కుదరడం. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో ఆ ఎమోషన్ మిస్ అయింది. కేవలం కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో కథనాన్ని నడింపించారు దర్శకుడు. కథ- కథనంపై ఫోకస్ చేయకుండా కాన్సెప్ట్‌ని నమ్ముకొని సినిమాను తెరకెక్కించారు.
వాస్తవానికి ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. దెయ్యాలతో సినిమా షూటింగ్ అనేది కొత్త పాయింటే. ఆ ఎపిసోడ్ వరకు కామెడీ బాగా వర్కౌట్ అయింది. కానీ మిగతా కథంతా అంతగా ఆకట్టుకునేలా సాగదు. ప్రేక్షకులను నవ్విస్తూనే..కొన్నిచోట్ల భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తిగా సక్సెస్ కాలేదు. కొన్ని సన్నివేశాలు అయితే మరీ రొటీన్‌గా ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాల్లో లాజిక్కులను వెతుకొద్దు. కానీ ఎమోషన్స్‌ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో చిత్రబృందం పూర్తిగా విఫలం అయింది.
ఎంతసేపు నవ్వించడం మీదనే ఫోకస్ పెట్టారు. పోనీ ఆ కామెడీ అయినా కొత్తగా ఉందంటే అదీ లేదు. ఫస్టాప్‌లో వచ్చే కామెడీ సీన్స్ అయితే జబర్దస్త్ షోని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ వరకు కథంతా సోసోగానే సాగుతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది. దెయ్యాలను జూనియర్ ఆర్టిస్టులు అని శ్రీను నమ్మించడం.. ఆ తర్వాత సత్య, సునీల్ పాత్రలు ఆ దెయ్యాలతో జరిపే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ పరమ రొటీన్‌గా ఉంటుంది. ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా భయపెట్టలేదు.. కడుపుబ్బా నవ్వించనూ లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం కాస్త ఎంటర్‌టైన్ అవుతారు.
ఎవరెలా చేశారంటే..
గీతాంజలి పాత్రలో అంజలి ఒదిగిపోయింది. అల్రేడీ చేసిన పాత్రే కాబట్టి.. ఇంకాస్త చక్కగా నటించింది. ఇందులో ఆమెకు ఓ యాక్షన్ సీన్ ఉంది. ఆ సీన్‌లో అదరగొట్టేసింది. ఈ సినిమాకు సత్య పోషించిన పాత్ర హైలెట్ అని చెప్పాలి. అయాన్‌గా ఆయన పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. శ్రీనివాస్‌రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నానిగా సునీల్ పండించిన కామెడీ కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది. దెయ్యాలుగా రవిశంకర్, ప్రియ కొన్ని చోట్ల భయపెట్టారు. ఆ పాత్రలకు సరైన ముగింపు ఉండదు. రాహుల్ మహదేవ్ విలనిజం అంతగా పండలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. హారర్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. బీజీఎంతోనే భయపెట్టాలి. కానీ ప్రవీణ్ లక్కరాజు ఆ స్థాయి నేపథ్య సంగీతాన్ని అందించలేకపోయాడు. పాటలు కూడా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. గ్రాఫిక్స్ విభాగం పనితీరు వీక్‌గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంభాషణలు కొన్నిచోట్ల ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment