
జెనీలియా( Genelia)... పరిచయం అక్కర్లేని పేరు. ‘అంతేనా... వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ’ అంటూ ‘బొమ్మరిల్లు’ సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్సే. సుమంత్ హీరోగా రూపొందిన ‘సత్యం’ (2003) సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ ‘సాంబ, సై, సుభాష్ చంద్రబోస్, హ్యాపీ, ఆరెంజ్, రెడీ, బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సొంతం చేసుకున్నారు. ‘నా ఇష్టం’ (2012) తర్వాత ఆమె మరో తెలుగు చిత్రంలో నటించలేదు. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పెళ్లి, పిల్లల కారణంగా దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారామె.

ఆ తర్వాత కమ్ బ్యాక్ అవుదామనుకుంటే తెలిసినవారెవరూ ప్రోత్సహించలేదనీ, పైగా నిరాశపరిచారనీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు జెనీలియా. ‘‘పిల్లలు పుట్టిన తర్వాత యాక్టింగ్‌కు దూరం అయ్యాను. కమ్ బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు తెలిసినవాళ్లెవరూ ప్రోత్సహించలేదు. ‘పదేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నావా? ఇది ఏమాత్రం వర్కౌట్ కాదు’ అంటూ నిరాశపరిచారు.
కానీ వారి మాటలు వినకుండా ధైర్యంగా రీ ఎంట్రీ ఇచ్చాను. నా భర్త రితేశ్ దేశ్‌ముఖ్‌తో కలిసి నేను నటించిన ‘వేద్’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అన్ని విషయాల్లో ఇతరులను నమ్మకూడదని నాకు అనిపించింది’’ అని తెలిపారు జెనీలియా. ప్రస్తుతం ఆమె ‘సితారె జమీన్ పర్, జూనియర్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.