‘‘వందేళ్ల క్రితం అమ్మను ‘అమ్మ’ అనే పిలిచాం. ఇప్పుడూ అమ్మా అనే పిలుస్తాం. తరాలు మారినా ఎమోషన్స్ మారలేదు. అలాగే సినిమాల విషయంలో ఆడియన్స్ మారలేదు. సరైన కంటెంట్ ఇస్తే ఆడియన్స్ సినిమాలు చూస్తున్నారు. అయితే కథలో ఆడియన్స్‌ను మనం ఎంతవరకు ఇన్‌వాల్వ్ చేయగలుగుతున్నాం అన్నదే ముఖ్యం. వారు కనెక్ట్ అయ్యే ఏ జానర్ సినిమా తీసినా వాటిని ఆదరిస్తారు’’ అన్నారు హీరో గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో గోపీచంద్ చెప్పిన విశేషాలు....
► ఈ మధ్య నేను ఎక్కువగా యాక్షన్ చిత్రాలే చేశాను. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేయాలని అనుకుంటున్నప్పుడు భూపతిరాజాగారు చెప్పిన కథ, అందులోని బ్రదర్ ఎమోషన్స్ నచ్చడంతో ‘రామబాణం’ సినిమా చేశాం. హిట్ చిత్రాలు ‘లక్ష్యం’, ‘లౌక్యం’ల తర్వాత శ్రీవాస్, నేను మరో సినిమా చేయాలని ‘రామబాణం’ చేయలేదు. కథ కుదిరింది కాబట్టి చేశాం.
► ‘రామబాణం’ అన్నదమ్ముల కథ. ఇద్దరి స్వభావం ఒకటే. కానీ ఎంచుకున్న దారులు వేరు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా చేశాం. అలాగే అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంది. ఓ సమస్యను మనం కొన్నేళ్లు పట్టించుకోకుండా ఉంటే దాని దుష్ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. అప్పుడు బాధ పడతాం. ఈ విషయాన్నే ‘రామబాణం’లో చూపించాం.
► ‘లక్ష్యం’ సినిమాలో జగపతిబాబుగారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆ సినిమాలో అన్నదమ్ముల్లా నటించిన మేం ‘రామబాణం’లోనూ అన్నదమ్ముల్లా నటించాం. ఈ సినిమాలో జగపతిబాబుగారిది కీలకపాత్ర. హీరోగా నా క్యారెక్టర్ పెంచేసి, ఆయన క్యారెక్టర్‌ను తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమాకు కథే హీరో. కథే సినిమాను నడిపించాలి.
► టీజీ విశ్వప్రసాద్‌గారు మంచి నిర్మాత. ఇండస్ట్రీలో అతి మంచితనం మంచిది కాదని నేను ఆయనకు చె΄్పాను. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారు ఇండస్ట్రీలో ఉంటే చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
► ప్రస్తుతం కన్నడ దర్శకుడు హర్షతో ఓ సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత దర్శకలు శ్రీను వైట్ల, తేజగార్లతో సినిమాలు ఉంటాయి.
► గతంలో నేను ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’ వంటి విభిన్నమైన సినిమాలు చేశాను. ఆ సినిమాలు ఇప్పుడు వచ్చి ఉంటే హిట్ అయ్యేవి. అయితే ఆ తరహా సినిమాల్లో నాకు నటించాలని ఉన్నా సరైన కథలు దొరకడం లేదు.
► హిట్ సినిమాలు అందించాలనే ఒత్తిడి నాకే కాదు... ప్రతి హీరోకూ ఉంటుంది. ఎందుకంటే ఓ సినిమా ఫలితంపై ఎన్నో కుటుంబాలు (ముఖ్యంగా బయ్యర్లు, డిస్ట్రిబూటర్స్‌ని ఉద్దేశిస్తూ..) ఆధారపడి ఉంటాయి. అయితే కొన్నిసార్లు హిట్ అవుతాయని మేం భావించిన సినిమాలు సరైన ఫలితాలను ఇవ్వక΄ోవచ్చు. తప్పులను విశ్లేషించుకుని అవి రిపీట్ కాకుండా చూసుకోవాలి. నాకు వచ్చిన ప్రతి రోల్‌ని డ్రీమ్ రోల్‌లా భావిస్తాను.
► నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లో విలన్ రోల్స్ చేశాను. ఇండస్ట్రీలో ముందు నన్ను నిలబెట్టింది విలన్ రోల్సే. ప్రభాస్ సినిమాలో విలన్‌పాత్ర చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే కథ, అందులోని విలన్‌పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment