director srivas
-
తరాలు మారినా ఎమోషన్స్ మారలేదు: హీరో గోపీచంద్
‘‘వందేళ్ల క్రితం అమ్మను ‘అమ్మ’ అనే పిలిచాం. ఇప్పుడూ అమ్మా అనే పిలుస్తాం. తరాలు మారినా ఎమోషన్స్ మారలేదు. అలాగే సినిమాల విషయంలో ఆడియన్స్ మారలేదు. సరైన కంటెంట్ ఇస్తే ఆడియన్స్ సినిమాలు చూస్తున్నారు. అయితే కథలో ఆడియన్స్‌ను మనం ఎంతవరకు ఇన్వాల్వ్ చేయగలుగుతున్నాం అన్నదే ముఖ్యం. వారు కనెక్ట్ అయ్యే ఏ జానర్ సినిమా తీసినా వాటిని ఆదరిస్తారు’’ అన్నారు హీరో గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో గోపీచంద్ చెప్పిన విశేషాలు.... ► ఈ మధ్య నేను ఎక్కువగా యాక్షన్ చిత్రాలే చేశాను. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేయాలని అనుకుంటున్నప్పుడు భూపతిరాజాగారు చెప్పిన కథ, అందులోని బ్రదర్ ఎమోషన్స్ నచ్చడంతో ‘రామబాణం’ సినిమా చేశాం. హిట్ చిత్రాలు ‘లక్ష్యం’, ‘లౌక్యం’ల తర్వాత శ్రీవాస్, నేను మరో సినిమా చేయాలని ‘రామబాణం’ చేయలేదు. కథ కుదిరింది కాబట్టి చేశాం. ► ‘రామబాణం’ అన్నదమ్ముల కథ. ఇద్దరి స్వభావం ఒకటే. కానీ ఎంచుకున్న దారులు వేరు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా చేశాం. అలాగే అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంది. ఓ సమస్యను మనం కొన్నేళ్లు పట్టించుకోకుండా ఉంటే దాని దుష్ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. అప్పుడు బాధ పడతాం. ఈ విషయాన్నే ‘రామబాణం’లో చూపించాం. ► ‘లక్ష్యం’ సినిమాలో జగపతిబాబుగారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆ సినిమాలో అన్నదమ్ముల్లా నటించిన మేం ‘రామబాణం’లోనూ అన్నదమ్ముల్లా నటించాం. ఈ సినిమాలో జగపతిబాబుగారిది కీలకపాత్ర. హీరోగా నా క్యారెక్టర్ పెంచేసి, ఆయన క్యారెక్టర్‌ను తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమాకు కథే హీరో. కథే సినిమాను నడిపించాలి. ► టీజీ విశ్వప్రసాద్‌గారు మంచి నిర్మాత. ఇండస్ట్రీలో అతి మంచితనం మంచిది కాదని నేను ఆయనకు చె΄్పాను. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారు ఇండస్ట్రీలో ఉంటే చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ► ప్రస్తుతం కన్నడ దర్శకుడు హర్షతో ఓ సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత దర్శకలు శ్రీను వైట్ల, తేజగార్లతో సినిమాలు ఉంటాయి. ► గతంలో నేను ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’ వంటి విభిన్నమైన సినిమాలు చేశాను. ఆ సినిమాలు ఇప్పుడు వచ్చి ఉంటే హిట్ అయ్యేవి. అయితే ఆ తరహా సినిమాల్లో నాకు నటించాలని ఉన్నా సరైన కథలు దొరకడం లేదు. ► హిట్ సినిమాలు అందించాలనే ఒత్తిడి నాకే కాదు... ప్రతి హీరోకూ ఉంటుంది. ఎందుకంటే ఓ సినిమా ఫలితంపై ఎన్నో కుటుంబాలు (ముఖ్యంగా బయ్యర్లు, డిస్ట్రిబూటర్స్ని ఉద్దేశిస్తూ..) ఆధారపడి ఉంటాయి. అయితే కొన్నిసార్లు హిట్ అవుతాయని మేం భావించిన సినిమాలు సరైన ఫలితాలను ఇవ్వక΄ోవచ్చు. తప్పులను విశ్లేషించుకుని అవి రిపీట్ కాకుండా చూసుకోవాలి. నాకు వచ్చిన ప్రతి రోల్‌ని డ్రీమ్ రోల్లా భావిస్తాను. ► నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లో విలన్ రోల్స్ చేశాను. ఇండస్ట్రీలో ముందు నన్ను నిలబెట్టింది విలన్ రోల్సే. ప్రభాస్ సినిమాలో విలన్‌పాత్ర చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే కథ, అందులోని విలన్‌పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండాలి. -
వేసవిలో రామబాణం
‘లక్ష్యం’ (2007), ‘లౌక్యం’ (2014) చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రానికి ‘రామబాణం’ టైటిల్‌ను ఖరారు చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను శనివారం ప్రకటించారు. డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుçష్బూ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో గోపీచంద్‌కు అన్నా వదిన పాత్రల్లో జగపతిబాబు, ఖుష్బూ కనిపిస్తారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీచంద్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ‘‘బాలకృష్ణగారు మా సినిమా టైటిల్‌ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమై ఉన్న బలమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు కథ: భూపతి రాజా, కెమెరా: వెట్రి పళనీస్వామి, సంగీతం: మిక్కీ జే మేయర్. -
పూజ లవ్స్ శ్రీనివాస్
ప్రేమలో పడ్డామనే ఊహే ఎంతో అందంగా ఉంటుంది కదూ! అలాంటప్పుడు ఎప్పుడూ ప్రేమ పల్లకీల్లో విహరించే హీరోయిన్లు మరింత అందంగా ఉండాలా? లేదా? చూస్తేనే కుర్రకారు ప్రేమలో పడేలా ఉండాలి కదూ! రీసెంట్ టైమ్స్‌లో కుర్రకారును అంతలా ప్రేమలో దించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే పూజా హెగ్డేనే. ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’లో పూజా అందం ప్రేక్షకులను ప్రేమలో పడేలా చేసింది. వాళ్లను అలా పడేసి... ఈ ముద్దుగుమ్మ మాత్రం మరొకరితో ప్రేమలో పడింది. అతనెవరంటే... బెల్లంకొండ శ్రీనివాస్. వీళ్లు ప్రేమలో పడింది దర్శకుడు శ్రీవాస్ కోసం! అంటే... రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో అన్నమాట! బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న సినిమాలో పూజా హెగ్డేను కథానాయికగా ఎంపికగా చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. త్వరలో ప్రారంభం కానున్న సెకండ్ షెడ్యూల్లో పూజ పాల్గొంటారని నిర్మాత తెలిపారు. ఇందులో ఆమె మరింత అందంగా కనిపిస్తారని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి యాక్షన్: పీటర్ హెయిన్స్, మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్. -
బట్ ఫర్ ఏ ఛేంజ్!
గౌతమ్ మీనన్, ఏఆర్ మురుగదాస్, ఎస్.జె.సూర్య.. వీళ్లంతా తమిళ దర్శకులే. అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగులో అగ్ర హీరోల సినిమాలకు దర్శకత్వం వహిస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్‌తో తీస్తున్న సినిమాతో ఈ జాబితాలోకి లింగుస్వామి చేరనున్నారు. ఇలా తమిళ దర్శకులు హైదరాబాద్ వచ్చి తెలుగు సినిమాలు తీయడమే తప్ప.. ఇటీవల మనోళ్లు చెన్నై వెళ్లి తమిళ సినిమాలు తీసింది తక్కువే. బట్ ఫర్ ఏ ఛేంజ్.. దర్శకుడు శ్రీవాస్ చెన్నై వెళ్తున్నారు. విశాల్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారట. విశాల్ ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ కావడమనేది కామన్. స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించాలనుందని చాలారోజుల నుంచి విశాల్ చెబుతున్నారు. ఆ కోరిక శ్రీవాస్ సినిమాతో తీరుతున్నట్టుంది. ఈ సంక్రాంతికి ‘డిక్టేటర్’తో హిట్ అందుకున్న శ్రీవాస్ స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నారట. ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. జనవరిలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ప్రస్తుతం ‘టెంపర్’ తమిళ రీమేక్, ‘పందెం కోడి 2’, దర్శకుడు మిస్కిన్ సినిమాలతో విశాల్ బిజీగా ఉన్నారు. ఇక, విశాల్, తమన్నా జంటగా నటించిన ‘ఒక్కడొచ్చాడు’ ఈ అక్టోబర్‌లో విడుదల కానుంది. -
సంక్రాంతిని శాసించే... డిక్టేటర్!
సంక్రాంతి సంరంభానికి బాలకృష్ణ ‘డిక్టేటర్’గా సమాయత్తమవుతున్నారు. ఇప్పటి వరకు సంక్రాంతి రేసులో బాలకృష్ణ ఎక్కువ విజయాలు అందుకోవడంతో ‘డిక్టేటర్’పై అంచనాలు రెట్టింపయ్యాయి. రానున్న సంక్రాంతికి బాలయ్య బాక్సాఫీస్‌ను శాసిస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘లౌక్యం’తో గోపీచంద్‌కు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు శ్రీవాస్ హీరో బాలకృష్ణను ‘డిక్టేటర్’గా స్టయిలిష్ లుక్‌లో చూపిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సోనాల్‌చౌహాన్, అక్ష నాయికలు. శ్రీవాస్ మాట్లాడుతూ - ‘‘ఢిల్లీ, హర్యానాల్లో జరిగిన షెడ్యూల్‌తో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ఇక ఒక పాట, ఒక యాక్షన్ ఎపిసోడ్ బ్యాలెన్స్ ఉన్నాయి. డిఫరెంట్‌గానే ఉంటూనే బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు సాగే యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా పాటలను ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. -
సంచలనాత్మక భాగస్వామ్యంలో ‘డిక్టేటర్’
వంద చిత్రాల మైలురాయికి దగ్గరవుతున్న హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు జోరు మీదున్నట్లు కనిపిస్తోంది. ఒకపక్క 98వ చిత్రంగా తయారవుతున్న ‘లయన్’ షూటింగ్లో పాల్గొంటూనే, నూరో చిత్రం దిశగా చర్చలు, ఆలోచనలు సాగిస్తున్నారు. వందో సినిమా ఏదన్నది ఇంకా ఖరారు కాకపోయినా, 99వ సినిమా గురించి మాత్రం అధికారికంగా అంతా సిద్ధమైపోయింది. ఆ మధ్య గోపీచంద్ ‘లౌక్యం’ చిత్రంతో ఘన విజయం సాధించిన దర్శకుడు శ్రీవాస్‌తో బాలకృష్ణ 99వ సినిమాకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. విశేషం ఏమిటంటే, ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం! దర్శకుడు శ్రీవాస్ సైతం మొదటిసారిగా నిర్మాత అవతారమెత్తి, చిత్ర నిర్మాణంలో భాగస్వామి కావడం! ‘ఈరోస్’ సంస్థ తామే ప్రారంభ దశ నుంచి చిత్ర నిర్మాణంలో అధికారికంగా భాగస్వాములై చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే! అలాగే, వారు ఒక దర్శకుడితో కలసి సంయుక్త భాగస్వామ్యంలో నిర్మిస్తున్న తొలి చిత్రమూ ఇదే! ఇన్ని విశేషాలున్న ఈ సినిమా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సంచలన వార్తగా నిలిచింది. బాలకృష్ణ సరసన ఆయనకు అచ్చి వచ్చిన కథానాయిక నయనతార ఈ చిత్రంలో నటించనున్నారు. రచయితలు కోన వెంకట్, గోపీమోహన్‌ల జంట ఈ చిత్ర కథను రూపొందించింది. ఈ క్రేజీ చిత్రానికి ‘డిక్టేటర్’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు భోగట్టా. దక్షిణ భారతదేశంలో ఈరోస్ సంస్థ వ్యవహారాలు చూస్తున్న సౌందర్యా రజనీకాంత్ ఈ కథ వినగానే ఉద్విగ్నతతో సంస్థ అధిపతి సునీల్ లుల్లాతో మాట్లాడి, ప్రాజెక్ట్‌ను పట్టాల మీదకు తెచ్చారట! ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘లయన్’ చిత్రం షూటింగ్ పూర్తవగానే, మార్చి నెలాఖరు నుంచి ఈ ‘డిక్టేటర్’ కెమేరా ముందుకు వస్తాడని ఆంతరంగిక వర్గాల కథనం. అప్పటి నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరిపి, దసరా స్పెషల్‌గా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ‘డిక్టేటర్’ కథతో ఉద్విగ్నతకు గురైన బాలకృష్ణ సైతం వీలైనంత వెంటనే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాలని ఉత్సాహంగా ఉన్నారని ఆంతరంగికులు చెబుతున్నారు. మొత్తానికి, ఈ వేసవికి ‘లయన్’గా... ఆ వెంటనే దసరాకు ‘డిక్టేటర్’గా బాలకృష్ణ అలరించనున్నారన్నమాట!