సంచలనాత్మక భాగస్వామ్యంలో ‘డిక్టేటర్’ | Balakrishna's Crazy Film from February | Sakshi
Sakshi News home page

సంచలనాత్మక భాగస్వామ్యంలో ‘డిక్టేటర్’

Published Fri, Feb 6 2015 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

సంచలనాత్మక భాగస్వామ్యంలో ‘డిక్టేటర్’

సంచలనాత్మక భాగస్వామ్యంలో ‘డిక్టేటర్’

వంద చిత్రాల మైలురాయికి దగ్గరవుతున్న హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు జోరు మీదున్నట్లు కనిపిస్తోంది. ఒకపక్క 98వ చిత్రంగా తయారవుతున్న ‘లయన్’ షూటింగ్‌లో పాల్గొంటూనే, నూరో చిత్రం దిశగా చర్చలు, ఆలోచనలు సాగిస్తున్నారు. వందో సినిమా ఏదన్నది ఇంకా ఖరారు కాకపోయినా, 99వ సినిమా గురించి మాత్రం అధికారికంగా అంతా సిద్ధమైపోయింది. ఆ మధ్య గోపీచంద్ ‘లౌక్యం’ చిత్రంతో ఘన విజయం సాధించిన దర్శకుడు శ్రీవాస్‌తో బాలకృష్ణ 99వ సినిమాకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

విశేషం ఏమిటంటే, ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం! దర్శకుడు శ్రీవాస్ సైతం మొదటిసారిగా నిర్మాత అవతారమెత్తి, చిత్ర నిర్మాణంలో భాగస్వామి కావడం! ‘ఈరోస్’ సంస్థ తామే ప్రారంభ దశ నుంచి చిత్ర నిర్మాణంలో అధికారికంగా భాగస్వాములై చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే! అలాగే, వారు ఒక దర్శకుడితో కలసి సంయుక్త భాగస్వామ్యంలో నిర్మిస్తున్న తొలి చిత్రమూ ఇదే! ఇన్ని విశేషాలున్న ఈ సినిమా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సంచలన వార్తగా నిలిచింది. బాలకృష్ణ సరసన ఆయనకు అచ్చి వచ్చిన కథానాయిక నయనతార ఈ చిత్రంలో నటించనున్నారు.

రచయితలు కోన వెంకట్, గోపీమోహన్‌ల జంట ఈ చిత్ర కథను రూపొందించింది. ఈ క్రేజీ చిత్రానికి ‘డిక్టేటర్’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు భోగట్టా. దక్షిణ భారతదేశంలో ఈరోస్ సంస్థ వ్యవహారాలు చూస్తున్న సౌందర్యా రజనీకాంత్ ఈ కథ వినగానే ఉద్విగ్నతతో సంస్థ అధిపతి సునీల్ లుల్లాతో మాట్లాడి, ప్రాజెక్ట్‌ను పట్టాల మీదకు తెచ్చారట! ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘లయన్’ చిత్రం షూటింగ్ పూర్తవగానే, మార్చి నెలాఖరు నుంచి ఈ ‘డిక్టేటర్’ కెమేరా ముందుకు వస్తాడని ఆంతరంగిక వర్గాల కథనం.

అప్పటి నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరిపి, దసరా స్పెషల్‌గా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ‘డిక్టేటర్’ కథతో ఉద్విగ్నతకు గురైన బాలకృష్ణ సైతం వీలైనంత వెంటనే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాలని ఉత్సాహంగా ఉన్నారని ఆంతరంగికులు చెబుతున్నారు. మొత్తానికి, ఈ వేసవికి ‘లయన్’గా... ఆ వెంటనే దసరాకు ‘డిక్టేటర్’గా బాలకృష్ణ అలరించనున్నారన్నమాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement