Hero Nandamuri Balakrishna
-
సంచలనాత్మక భాగస్వామ్యంలో ‘డిక్టేటర్’
వంద చిత్రాల మైలురాయికి దగ్గరవుతున్న హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు జోరు మీదున్నట్లు కనిపిస్తోంది. ఒకపక్క 98వ చిత్రంగా తయారవుతున్న ‘లయన్’ షూటింగ్లో పాల్గొంటూనే, నూరో చిత్రం దిశగా చర్చలు, ఆలోచనలు సాగిస్తున్నారు. వందో సినిమా ఏదన్నది ఇంకా ఖరారు కాకపోయినా, 99వ సినిమా గురించి మాత్రం అధికారికంగా అంతా సిద్ధమైపోయింది. ఆ మధ్య గోపీచంద్ ‘లౌక్యం’ చిత్రంతో ఘన విజయం సాధించిన దర్శకుడు శ్రీవాస్‌తో బాలకృష్ణ 99వ సినిమాకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. విశేషం ఏమిటంటే, ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం! దర్శకుడు శ్రీవాస్ సైతం మొదటిసారిగా నిర్మాత అవతారమెత్తి, చిత్ర నిర్మాణంలో భాగస్వామి కావడం! ‘ఈరోస్’ సంస్థ తామే ప్రారంభ దశ నుంచి చిత్ర నిర్మాణంలో అధికారికంగా భాగస్వాములై చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే! అలాగే, వారు ఒక దర్శకుడితో కలసి సంయుక్త భాగస్వామ్యంలో నిర్మిస్తున్న తొలి చిత్రమూ ఇదే! ఇన్ని విశేషాలున్న ఈ సినిమా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సంచలన వార్తగా నిలిచింది. బాలకృష్ణ సరసన ఆయనకు అచ్చి వచ్చిన కథానాయిక నయనతార ఈ చిత్రంలో నటించనున్నారు. రచయితలు కోన వెంకట్, గోపీమోహన్‌ల జంట ఈ చిత్ర కథను రూపొందించింది. ఈ క్రేజీ చిత్రానికి ‘డిక్టేటర్’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు భోగట్టా. దక్షిణ భారతదేశంలో ఈరోస్ సంస్థ వ్యవహారాలు చూస్తున్న సౌందర్యా రజనీకాంత్ ఈ కథ వినగానే ఉద్విగ్నతతో సంస్థ అధిపతి సునీల్ లుల్లాతో మాట్లాడి, ప్రాజెక్ట్‌ను పట్టాల మీదకు తెచ్చారట! ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘లయన్’ చిత్రం షూటింగ్ పూర్తవగానే, మార్చి నెలాఖరు నుంచి ఈ ‘డిక్టేటర్’ కెమేరా ముందుకు వస్తాడని ఆంతరంగిక వర్గాల కథనం. అప్పటి నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరిపి, దసరా స్పెషల్‌గా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ‘డిక్టేటర్’ కథతో ఉద్విగ్నతకు గురైన బాలకృష్ణ సైతం వీలైనంత వెంటనే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాలని ఉత్సాహంగా ఉన్నారని ఆంతరంగికులు చెబుతున్నారు. మొత్తానికి, ఈ వేసవికి ‘లయన్’గా... ఆ వెంటనే దసరాకు ‘డిక్టేటర్’గా బాలకృష్ణ అలరించనున్నారన్నమాట! -
ఇనుమడించిన ఉత్సాహంతో...
హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మంచి హుషారులో ఉన్నారు. తాజా చిత్రంలో శక్తిమంతమైన సి.బి.ఐ. అధికారిగా నటిస్తున్న ఆయన, ఆగస్టు మొదట్లో కాలికి గాయం తగిలినా లెక్క చేయకుండా పన్నెండు రోజుల్లోనే మళ్ళీ షూటింగ్‌కు వచ్చేశారు. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మాణమవుతోంది. ఇటీవలే ముగిసిన తాజా షెడ్యూల్లో నోబుల్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో త్రిష, మరో 20 మంది డ్యాన్సర్లతో కలసి అయిదు రోజుల పాటు పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. ‘‘హైదరాబాద్ పరిసరాల్లో ఈ పాట తీశాం. అక్టోబర్ 4 నుంచి తదుపరి షెడ్యూల్ నిర్విరామంగా చేయనున్నాం. ఇప్పటికే దాదాపు 40 శాతం సినిమా పూర్తయింది’’ అని నిర్మాత రుద్రపాటి రమణారావు ‘సాక్షి’కి చెప్పారు. ప్రకాశ్‌రాజ్, ఎమ్మెస్ నారాయణ సైతం తాజా షెడ్యూల్లో పాల్గొన్నారు. 12న ‘లెజెండ్’ డబుల్ సెంచరీ: ఇక, బాలకృష్ణ ఉత్సాహం మరింత పెంచుతూ ఇనుమడింపజేస్తూ, ఆయన ఇటీవలి చిత్రం ‘లెజెండ్’ డబుల్ సెంచరీ జరుపుకొంటోంది. శతదినోత్సవాలే కరవైన నేటి డిజిటల్ యుగంలో ‘లెజెండ్’ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేరుగా, ప్రొద్దుటూరులో సింగిల్ షిఫ్ట్‌తో 200 రోజులు ఆడింది. ఈ సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో, నిర్మాతల సహకారంతో భారీయెత్తున ఈ నెల 12వ తేదీ ఆదివారం ఎమ్మిగనూరులో ‘లెజెండ్’ ద్విశతదినోత్సవం జరుపుతున్నారు. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు చిత్ర ప్రధాన తారాగణం, సాంకేతిక వర్గం హైదరాబాద్ నుంచి వెళ్ళి, ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ కెరీర్లో ‘ముద్దులకృష్ణయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా’ చిత్రాల తరువాత ఇది 5వ డబుల్ సెంచరీ కావడం విశేషం.