టైటిల్: గొర్రె పురాణం
నటీనటులు: సుహాస్, పోసాని కృష్ణ మురళి, రఘు తదితరులు
నిర్మాత: ప్రవీణ్ రెడ్డి
దర్శకత్వం: బాబీ
సంగీతం: పవన్ సీహెచ్
సినిమాటోగ్రఫీ: సురేశ్ సారంగం
విడుదల తేది: సెప్టెంబర్ 21, 2024
యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం లాంటి సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అదే జోష్‌లో ‘గొర్రెపురాణం’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్‌లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్‌లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు.
ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఒక జంతువునే ప్రధాన పాత్రధారిగా పెట్టుకొని హాలీవుడ్‌లో చాలా సినిమాలు వచ్చాయి. ఇక తెలుగులో అయితే రాజమౌళి చిన్న ఈగతో సినిమా తీసి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో కూడా ఒక జంతువునే హీరో. కథంతా గొర్రె చుట్టే నడిపిస్తూ... ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా అంశాలను ప్రస్తావించారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తారు? తమపై వచ్చే వ్యతిరేకతను తగ్గించుకోవడానికి మీడియాను ఎలా వాడుకుంటారు? అనేది సెటైరికల్‌గా తెరపై చూపించారు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే దాన్ని తెరపై చూపించే విషయంలో కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు. బహుశా బడ్జెట్ ప్రాబ్లమ్ కావొచ్చ కొన్ని ముఖ్యమైన సీన్లను కూడా సాదా సీదాగా తీసేశారు.
ఓ మర్డర్ సీన్‌తో కథను ప్రారంభించి మొదట్లోనే ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్‌తో గొర్రె ఎంట్రీ ఆకట్టుకుంటుంది. అది రెండు మతాల మధ్య చిచ్చు పెట్టినప్పటి నుంచి కథపై ఆసక్తి కలుగుతుంది. గొర్రె చుట్టూ సాగే సరదా సన్నివేశాలతో బోర్ కొట్టకుండా ఫస్టాఫ్ సాగుతుంది. ఒక్క సీన్ మీనహా ఇంటర్వెల్ వరకు సుహాస్ తెరపై కనిపించదు. ఇక ద్వితియార్థంలో ఎక్కువ భాగం జైలు, కోర్టు సీన్లతోనే సాగుతుంది. రవి ప్లాష్ బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. గొర్రెను జైలు నుంచి తప్పించేందుకు హీరో చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. కోర్టు సీన్‌లో సుహాస్ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. లాజిక్స్ వెతక్కుకుండా చూస్తే..‘గొర్రె పురాణం’ నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో హీరో గొర్రె అనే చెప్పాలి. ఒక గొర్రెకు తరుణ్ భాస్కర్, మరొక గొర్రెకు గెటప్ శ్రీను వాయిస్ ఓవర్ ఇచ్చారు. రెండు గొర్రెల మధ్య వచ్చే సీన్లకు వీరిద్దరు ఇచ్చే వాయిస్ ఓవర్ నవ్వులు పూయిస్తాయి. ఇక ఈ చిత్రంలోసుహాస్‌ది కీలక పాత్ర. నిడివి తక్కువే అయినా ఎప్పటి మాదిరిగానే తన పాత్రలో లీనమై నటించాడు సుహాస్. ఖైదీ రవి పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇక హిందూ వాదిగా రఘు, జడ్జీగా పొసాని తమదైన కామెడీ పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పవన్ సీహెచ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. నిడివి తక్కువ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
Comments
Please login to add a commentAdd a comment