కొందరు సినిమా ఛాన్స్ వస్తే చాలనుకుంటారు, మరికొందరు మంచి రోల్ వస్తేనే చేస్తామంటారు. బాలీవుడ్ నటుడు గోవింద రెండో కేటగిరీకి చెందినవాడు. వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ పోయే రకం కాదు. చిన్న చిత్రమైనా, పెద్ద సినిమా అయినా తన మనసుకు నచ్చితేనే అందులో నటిస్తాడు. ఈమాటకు కట్టుబడి నాలుగేళ్లగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను దేన్నీ అంత సులువుగా అంగీకరించను. జనాలేమో నాకు అవకాశాలు రావడం లేదనుకుంటారు. కానీ వినాయకుడి ఆశీర్వాదాలు నాకెప్పుడూ ఉన్నాయి. నాకు ఛాన్సులు వస్తున్నాయి. గతేడాది నేను.. వంద కోట్లతో తెరకెక్కిన ప్రాజెక్టులను రిజెక్ట్ చేశాను. అసలు ఏ సినిమాకూ సంతకం చేయలేదు. దీంతో అద్దం ముందు నిల్చుని నన్ను నేను కొట్టుకున్నాను. నిజానికి వాళ్లు చాలా డబ్బు ఇస్తామన్నారు, కానీ నాకు ఏదిపడితే అది, పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలు చేయడం ఇష్టం లేకపోవడంతో వదిలేసుకున్నాను. ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తాను' అని చెప్పుకొచ్చాడు.
కాగా గోవింద 1986లో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టాడు. 170కు పైగా చిత్రాల్లో నటించాడు. హీరో నెం.1, షోలా ఔర్ షబ్నం, పార్ట్‌నర్ వంటి అనేక హిట్ చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఈయన చివరగా 2019లో వచ్చిన రంగీలా రాజా సినిమాలో నటించాడు. అప్పటినుంచి మరే చిత్రంలోనూ కనిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment