గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్న సందర్భంగా చిరంజీవి
156 చిత్రాలు... 537 పాటలు... 24 వేల డ్యాన్స్ మూమెంట్స్... ఆ 24వేల డ్యాన్స్ మూమెంట్స్ హీరో చిరంజీవి పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరేలా చేశాయి. యాక్టర్, డ్యాన్సర్ విభాగంలో ‘మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు చిరంజీవిని ఈ రికార్డ్‌కి ఎంపిక చేశారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవికి ఈ రికార్డ్‌ని అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘నటనకు అవార్డులు వస్తాయని తెలుసు. కానీ ఇలా డ్యాన్సులకు రావడం అనేది ఊహించలేదు. నాకు నటన మీదకన్నా డ్యాన్స్ మీద ఆసక్తి ఎక్కువ. బహుశా అదే నాకు ఈ అవార్డు తెచ్చిపెట్టి ఉంటుందని అనుకుంటున్నా. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కి, మనకు సంబంధం ఏంటి? అని అనుకుంటాం కదా. అందుకని ఈ రికార్డు గురించి నాకు ఊహే లేదు. డ్యాన్స్ అనేది నాకు అదనపు అర్హత అయితే నా కొరియోగ్రాఫర్‌లు, నా ఈ విజయంలో నా దర్శక–నిర్మాతలు, అభిమానుల పాత్ర మరువలేనిది.
నటనకన్నా ముందే డ్యాన్స్‌కి ఓనమాలు
చిన్నప్పుడు సాయంత్రం అయ్యేసరికి వివిధభారతి, రేడియో సిలోన్‌లో వచ్చే పాటలకు డ్యాన్సులు చేసేవాడిని. రేడియోల్లో పాటలు రాగానే, ‘శంకర్‌బాబు (చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్) ని పిలవండి. డ్యాన్సులు వేస్తాడు’ అనేవారు. ఉత్సాహంగా స్టెప్పులు వేసేవాడిని. ఎన్‌సీసీలో చేరాక సాయంత్రాల్లో తిన్నాక అల్యూమినియమ్ ప్లేట్లను తిరగేసి వాయించి డ్యాన్సులు వేసేవాడిని
కాలు జారి పడినా ఆపలేదు
ఒకసారి రాజమండ్రిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు సావిత్రి, రోజా రమణి, కవిత, నరసింహరాజు... ఇలా అందరూ సాయంత్రం ఓ పంచలో కూర్చున్నారు. లైట్‌గా వర్షం పడుతోంది. నన్ను డ్యాన్స్ చేయమని అడిగారు. వర్షానికి కాలు జారి కిందపడినా ఆపలేదు. దాన్ని నాగిని డ్యాన్సులాగా మార్చేసి స్టెప్పులేశాను. అక్కడున్న కో–డైరక్టర్ చూసి దర్శకుడు క్రాంతికుమార్‌గారికి చె΄్పారు. ప్రాణం ఖరీదు’కి నన్ను తీసుకున్నప్పుడు ‘ఏలియల్లో ఏలియల్లో ఎందాక...’ అనే పాటను పెట్టారు. ఆ పాటకు స్టెప్ వేశాను. దానికన్నా ముందు ‘పునాది రాళ్లు’లోనూ డ్యాన్స్ వేస్తూ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాను.
చిరంజీవి ఉంటే ఎక్కువ డబ్బు అన్నారు
ఆ రోజుల్లో లింగమూర్తిగారు డిస్ట్రిబ్యూషన్‌కి చీఫ్. ఆయన ఏ నిర్మాత కథ వింటారు? ఎవరికి డబ్బులు శాంక్షన్ చేస్తారనే పరిస్థితి ఉండేది. ఒకసారి ఆయన ‘చిరంజీవి అని కొత్తగా వస్తున్నాడు. అతనితో సినిమాలు చేస్తే మీకు ఇంత డబ్బు ఇస్తాను. లేదంటే లిమిటెడ్‌గా ఇస్తాను’ అన్నారు. దాంతో అందరూ చిరంజీవినే పెట్టుకుందాం అనుకునేవారు. లింగమూర్తిగారికి ప్రజానాడి తెలుసు. ఆడియన్స్ ఇతని సాంగ్స్ కోసమే సినిమాలకు వస్తున్నారు. అలాంటప్పుడు ఇతనితో సినిమాలు చేస్తే నాలుగు డబ్బులు వస్తాయి కదా అని ఆయన మా నిర్మాతలతో అనడం.. వాళ్లు కూడా నాకు అవకాశాలు ఇవ్వడం అన్నది నాకు ప్లస్ అయింది’’ అన్నారు.
ఆ డ్యాన్సుల్లో మనసు కనబడుతుంది
ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు ఫోన్ చేసి, ఈవెంట్‌కి రావాలని అడిగినప్పుడు ‘అడగకూడదు... మీరు ఆర్డర్ వెయ్యాలి’ అన్నాను. చిరంజీవిగారి డ్యాన్సులు ఎందుకు బాగుంటాయంటే ఆ డ్యాన్సుల్లో ఆయన మనసు కనబడుతుంది. తనని తాను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తారు కాబట్టి చూడ్డానికి మనకు రెండు కళ్లూ సరిపోవు’’ అన్నారు.
537 పాటలు చూడటం నాకో మంచి అనుభూతి
రిచర్డ్ స్టెన్నింగ్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి 46 ఏళ్ల కెరీర్‌లో రిలీజైన కమర్షియల్ సినిమాలను పరిగణనలోకి తీసుకున్నాం. 156 సినిమాలనేది అద్భుతమైన అచీవ్‌మెంట్. ఆ సినిమాల్లో ఆయన డ్యాన్స్ చేసిన పాటలను తీసుకున్నాం. 537 పాటల్లో ఆయన వేసిన 24 వేల డ్యాన్స్ మూవ్స్ చూశాం. ఆ పాటలు చూడటం వ్యక్తిగతంగా నాకు మంచి అనుభూతినిచ్చింది. ఆయనకు గిన్నిస్ రికార్డ్ అందించాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆమిర్ ఖాన్‌కు చిరంజీవి ఓ పెన్నుని బహుమతిగా అందజేశారు. ఇంకా దర్శక–నిర్మాతలు కోదండ రామిరెడ్డి, కె. రాఘవేంద్ర రావు, బి. గోపాల్, గుణశేఖర్, బాబీ, వశిష్ఠ, అశ్వనీదత్, కేఎస్ రామారావు, అల్లు అరవింద్, డి. సురేష్‌బాబు, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, పి. కిరణ్, చిరంజీవి కుటుంబ సభ్యులు సుష్మిత, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు.
చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు’ 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజునే చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకోవడం ఓ విశేషం. కాగా సరిగ్గా చిరంజీవి పుట్టిన సంవత్సరం 1955లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కి శ్రీకారం జరిగింది. అయితే చిరంజీవి పుట్టిన తేదీ 22 కాగా... ఈ రికార్డ్‌కి శ్రీకారం చుట్టింది 19వ తేదీన.
25 రోజులుగా చికున్ గున్యాతో చిరంజీవి బాధపడుతున్నారని, అయినప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని యాంకర్ పేర్కొన్నారు. ఆయన కోలుకుంటున్నారని కూడా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment