సాక్షి, వెబ్‌డెస్క్: ఆయన మ్యూజిక్ వింటే ఎవరికైనా స్టెప్పులేయాలనిపిస్తుంది. రొమాంటిక్, సెంటిమెంటల్, దుమ్మురేపే మాస్ బీట్స్, హుషారెత్తించే ఐటమ్స్ సాంగ్స్.. ఏదైనా తనదైన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడు. ఆయన మరెవరోకాదు.. అభిమానులచే ముద్దుగా డీఎస్పీ అని పిలవబడే దేవిశ్రీ ప్రసాద్. స్వచ్ఛమైన సంగీతానికి కేరాఫ్‌గా నిలిచే పేరు అది. ఎనర్జీ అనే పదానికి నిర్వచనం ఆయన. తన మ్యూజికల్ మ్యాజిక్‌తో ఎన్నో చిత్రాలకు బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు నేడు(ఆగస్ట్ 2). ఈ సందర్భంగా ‘డీఎస్పీ’గురించి..
దేవీశ్రీ ప్రసాద్.. 1979, ఆగస్ట్ 2న గొర్తి సత్యమూర్తి, శిరోమణి దంపతులకు జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని రాయవరం మండలంలోని వెదురుపాక వీరి స్వగ్రామం.దేవీకి ఒక తమ్ముడు సాగర్, చెల్లి పద్మిణి ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ చిన్ననాటి నుండి సంగీత ప్రపంచంలోనే పెరిగారు. ఆయన తండ్రి గొర్తి సత్యమూర్తి గొప్ప కథా రచయిత. దేవత’‘ఖైదీ నంబర్ 786’, ‘అభిలాష’, ‘పోలీస్ లాకప్’, ‘ఛాలెంజ్’ వంటి విజయవంవతమైన చిత్రాలకి ఆయన కథలు అందించారు. ఒక రకంగా దేవీ సినిమాల్లోకి రావడానికి కారణం ఆయనే.
అసలు దేవిశ్రీప్రసాద్ అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేవిశ్రీ ప్రసాద్ అమ్మమ్మ పేరులోని దేవి.. తాతయ్య పేరులోని ప్రసాద్ ను తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ గా కూర్చి ఆ పేరు పెట్టారు.చెన్నైలో ఇంటర్ వరకు చదువుకున్న దేవిశ్రీ ప్రసాద్ చిన్న వయసులోనే మాండొలిన్ నేర్చుకున్నాడు. మాండొలిన్ శ్రీనివాస్ ఈ సంగీత దర్శకుడి గురువు.
టీనేజ్ లోనే మ్యూజిక్ దర్శకుడిగా
దేవిశ్రీకి చిన్నప్పటి నుంచే సంగీత దర్శకుణ్ణి కావాలని కోరికట. ఆరో తరగతిలో ఉండగానే, పెద్దయ్యాక ఏమవుతావని స్కూల్లో అడిగితే, ‘మ్యూజిక్ డెరైక్టర్‌ని అవుతా’చెప్పాడట. ఇంట్లో కూడా అతని ఇష్టాలను గౌరవించేవాళ్లు.
ఒక రోజు ఎంఎస్ రాజు దేవీశ్రీ ప్రసాద్ ఇంటికి వచ్చారట. ఆ సమయంలో దేవీశ్రీ గదిలో నుంచి సంగీత వాద్యాల శబ్దాలు విని, ఒక సందర్భానికి ట్యూన్ ఇవ్వమని అడిగారు. రెండు రోజుల్లోనే ట్యూన్ ఇచ్చి ఎంఎస్ రాజు ఫిదా అయ్యాడట. వెంటనే ‘దేవి’సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడట. అప్పుడు దేవిశ్రీ ప్లస్ 2 చదువుతున్నాడు. అలా టీనేజ్‌లో మ్యూజిక్ డైరెక్టరై రికార్డును సృష్టించాడు.
మెగా ఫ్యామిలీతో మ్యూజికల్ బాండ్
డీఎస్పీ కెరీర్ ను గమనిస్తే మెగా కాంపౌండ్ తో అవినాభావ సంబంధం ఉందని చెప్పొచ్చు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ - ఇలా ఫ్యామిలీలోని అందరికీ మ్యూజికల్ హిట్స్ అందించాడు. చిరంజీవి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, అందరివాడు, ఖైదీ150 చిత్రాలకు సంగీతం అందించిన దేవీ... పవన్ కల్యాణ్‌కు 'జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది మూడు బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించాడు.
అలాగే అల్లు అర్జున్ ఆర్య, ఆర్య-2, బన్ని, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, రామ్ చరణ్ ‘ఎవడు’, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’చిత్రాలను స్వరకల్పన చేసి విజయంలో పాలుపంచుకున్నాడు.
ఒక మెగా హీరోలకే కాదు.. టాలీవుడ్ టాప్ హీరోలందరితో పనిచేశాడు దేవిశ్రీ. అక్కినేని నాగార్జున ‘మన్మథుడు, మాస్' ఢమరుకం, కింగ్ , భాయ్ చిత్రాలకు, మహేశ్‌బాబు ‘వన్-నేనొక్కడి,శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు మీకెవ్వరు సినిమాలతో పాటు, ప్రభాస్ వర్షం,పౌర్ణమి, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి, జూనియర్ ఎన్టీఆర్ "నా అల్లుడు, రాఖీ, అదుర్స్, ఊసరవెల్లి, జనతా గ్యారేజ్‌మూవీస్‌కు కూడా దేవిశ్రీ పసందైన బాణీలు అందించాడు. రెండు దశాబ్దాలుగా సంగీత ప్రియులకు అలరిస్తున్న దేవీ.. మున్ముందు కూడా తనదైన బాణీలలో ప్రేక్షలకు వీనులవిందు అందించాలని ఆశిస్తూ.. ‘సాక్షి’తరపున దేవీశ్రీ ప్రసాద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Comments
Please login to add a commentAdd a comment