Director Harish Shankar Fires On Controversial Journalist Question - Sakshi
Sakshi News home page

Harish Shankar: 'అలాంటి సినిమాలు మీరు తీయగలరా?' హరీశ్‌ శంకర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published Thu, May 25 2023 7:31 AM

Harish Shankar strong counter to the journalist - Sakshi

2018 సినిమా.. మలయాళ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. వారం రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. టొవినో థామస్‌, కుంచక్కో బోబన్‌, వినీత్‌ శ్రీనివాసన్‌, అసిఫ్‌ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జూడ్‌ ఆంటోని జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిలి, సీకే పద్మకుమార్‌, ఆంటో జోసెఫ్‌ నిర్మించిన ఈ సినిమాను బన్నీ వాసు తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ నెల 26న తెలుగులో 2018 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ సినిమా చాలా బాగుందని, ఇది తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పాడు. 

తర్వాత ఓ విలేఖరి మాట్లాడుతూ.. 'మన తెలుగు దర్శకనిర్మాతలు ఇంతవరకు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా చూశాక మన తెలుగు డైరెక్టర్‌ ఇలాంటి సినిమాలు తీయగలరా? ఇక్కడి నిర్మాతలు సాహసం చేయగలరా? అని మీకు అనిపించిందా?' ప్రశ్నించాడు. దీనికి హరీశ్‌ శంకర్‌ స్పందిస్తూ.. 'ప్రెస్‌మీట్స్‌ జరిగిన ప్రతిసారి ఆయన(విలేఖరిని ఉద్దేశిస్తూ) సాహసోపేతమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరూ అడగని ప్రశ్నలు అడుగుతూ సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచి యూట్యూబ్‌లో ఒక ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు.

ప్రపంచ సినిమా మన చేతికొచ్చేసింది(తెలుగు సినిమాను ఉద్దేశిస్తూ). అలాంటి టెక్నాలజీలో ఉన్నాం. ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి, కేజీఎఫ్‌లను ఎవరైనా డబ్బింగ్‌ సినిమా అనుకున్నారా? అనుకోలేదు కదా! డబ్బింగ్‌, రీమేక్‌ అదంతా ఏమీ లేదు.. కేవలం సినిమా అంతే! ఏ సినిమా ఎక్కడికెళ్లినా సంతోషించాలి. తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయరా? అని అడుగుతున్నావ్‌.. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్నప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారంటే జాలేస్తోంది. అతడు కేరళ డైరెక్టర్‌ అని ఈ సినిమా చూడలేదు. ఆయనో గొప్ప సినిమా తీశారని పత్రికాముఖంగా ఆయన్ను మెచ్చుకుందామని వచ్చాను.

గీతా ఆర్ట్స్‌ డబ్బింగ్‌ సినిమాలకే పరిమితమైపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు కదా.. నేనే వరుసగా 100 డబ్బింగ్‌ సినిమాలు చేయిస్తా.. అందులో తప్పేంటి? ఒక మంచి సినిమాను పదిమందికి చూపించే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. ఈ సినిమాను ముందు మీకే చూపించాలని వాసు(నిర్మాత) అన్నాడు. ఎందుకంటే సినిమా నచ్చితే మీరు చేసినంత ప్రమోషన్స్‌ నిర్మాత కూడా చేయలేడు. డబ్బింగా? రీమేకా? అన్నది కాదు.. మంచి సినిమాలు చేస్తాం. తెలుగు, తమిళ, హిందీ దర్శకుడు అని భాషాబేధాలు చూడట్లేదు. సినిమా అనేది ఒక ఎమోషన్‌. దానికి భాషతో సంబంధం లేదు' అని చెప్పుకొచ్చాడు హరీశ్‌ శంకర్‌. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ.. చులకన చేసే నోరు ఉన్నప్పుడు చురకలు వేసే నోరు కూడా ఉంటుందని ట్వీట్‌ చేశాడు.

చదవండి: టాలీవుడ్‌కు మరో కొత్త హీరోయిన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement