టైటిల్: హరోం హర
నటీనటులు: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కి లక్ష్మణ్, అక్షర గౌడ, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులు
నిర్మాత : సుమంత్ జి నాయుడు
రచన, దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారక
సంగీతం: చైతన్ భరద్వాజ్
ఎడిటర్ : రవితేజ గిరిజాల
విడుదల తేది: జూన్ 14, 2024
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూనే ఉంటాడు. ఈ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం ‘హరోం హర’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘హరోం హర’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1989లో సాగుతుంది. కుప్పం ప్రాంతాన్ని అంతా తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కొడుకు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. వ్యవసాయ భూములను కబ్జా చేస్తూ.. అడ్డొచ్చిన వారిని అంతం చేస్తుంటారు. తమ్మిరెడ్డి అరాచకాలకు భయపడి.. చాలా మంది వేరే ప్రాంతానికి వలస వెళ్తారు. ఆ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలోకి ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు సుబ్రమణ్యం(సుధీర్ బాబు). అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు.
ఆ విషయం శరత్ తెలియడం.. కాజేపీ ప్రిన్సిపల్‌కి వార్నింగ్ ఇవ్వడంతో సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు సొంతూర్లో తండ్రి (జయ ప్రకాశ్) చేసిన అప్పులు మూడు నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. (Harom Hara Review) ఇలాంటి సమయంలో స్నేహితుడు పళని(సునీల్) ఇచ్చిన సలహాతో గన్స్ తయారు చేయాలని ఆలోచిస్తాడు సుబ్రమణ్యం. ఆ తర్వాత ఏం జరిగింది? అక్రమ ఆయుధాల సరఫరా మాఫియా సుబ్రమణ్యం జీవితాన్ని ఎలా మార్చేసింది? తమ్మిరెడ్డితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువలను ఎలా ఎదుర్కొన్నాడు? తండ్రి అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మాఫియా లీడర్‌కు ఓ ఊరు మొత్తం ఎందుకు అండగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఓ ప్రాంతాన్ని కొంతమంది దుర్మార్గులు తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రజలను హింసించడం.. అక్కడకు హీరో సాధారణ వ్యక్తిలా వచ్చి వారిని అంతమొందించి ప్రజలకు విముక్తి కలిగించడం.. ఇలాంటి కథలు టాలీవుడ్‌లో చాలా వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. హరోం హర మూవీ లైన్ కూడా ఇదే. కేజీయఫ్, పుష్ప సినిమాల మాదిరి హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు. (Harom Hara Review)
సినిమా ప్రారంభం మొదలుకొని క్లైమాక్స్ వరకు ప్రతీ సన్నివేశం.. పుష్ప, కేజీయఫ్, ఛత్రపతి సినిమాలను గుర్తు చేస్తుంది. ఇక విలన్లు చేసే అరాచకాలు చాలా పాత సినిమాలను గుర్తు చేస్తాయి. కేజీయఫ్ స్టైల్లో పళని(సునీల్) హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ కథను ప్రారంభిస్తాడు. తమ్మిరెడ్డి, శరత్ పరిచయ సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. హీరో ఎంట్రీ చాలా సింపుల్‌గా ఉంటుంది. హీరోయిన్‌తో లవ్‌ట్రాక్ నడిపిస్తూనే.. ఊర్లో తమ్మిరెడ్డి మనుషుల ఆగడాలను చూపిస్తారు. అయితే అటు లవ్ ట్రాక్‌తో పాటు రొట్టకొట్టుడు విలనిజం బోర్ కొట్టిస్తుంది.
హీరో గన్స్ తయారు చేయాలని డిసైడ్ అయ్యేవరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని ఫైట్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక హీరో తుపాకులు తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వడం.. యాక్షన్ సీన్స్ అదిరిపోవడంతో ఫస్టాఫ్ కాస్త ఆకట్టుకుంటుంది.
ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం నీరసంగా సాగుతుంది. కేజీయఫ్, విక్రమ్ మాదిరి యాక్షన్స్ సీన్స్ వస్తుంటాయి కానీ ఎక్కడా ఆకట్టుకోలేవు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, అమితాబ్ అంటూ పేర్లు పెట్టి కొత్త తుపాకులను అమ్మడం కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. (Harom Hara Movie Review) ఇక చివర్లో జ్యోతిలక్ష్మి(హీరో ప్రత్యేకంగా తయారు చేసిన పెద్ద గన్)తో వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. అయితే ఈ సినిమా నేపథ్యంతో పాటు పాత్రలను తిర్చిదిద్దిన విధానం.. పలికించిన భాష, యాస అన్ని పుష్స సినిమాను గుర్తు చేసేలా ఉంటాయి. మాస్ యాక్షన్ సినిమాలకు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
సుబ్రమణ్యం పాత్రలు సుధీర్ ఒదిగిపోయాడు. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో సుధీర్ నటించలేదు. యాక్షన్ సీన్స్‌లో చించేశాడు. మాళవిక శర్మ తెరపై కనిపించేదే కాసేపే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. పోలీసు ఆఫీసర్‌గా అక్షర గౌడ తన పాత్ర పరిధిమేర నటించింది. సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ పళనిస్వామిగా సునీల్, విలన్లుగా రవి కాలే, అర్జున్ గౌడ, లక్కి లక్ష్మణ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. (Harom Hara Movie Review) హీరో తండ్రిగా నటించిన జయప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చేతన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- రేటింగ్: 2.75/5
Comments
Please login to add a commentAdd a comment