యువతిని మోసం చేశాడంటూ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయి సోమవారం నాడు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యాడు. గత కొన్నాళ్లుగా విదేశాల్లో ఉంటున్న ఆయన తనపై కేసు నమోదైన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశాడు.
అది నా సినిమా
కొందరు కావాలనే తనపై అసత్యప్రచారం చేశారని పేర్కొన్నాడు. తాను సొంతగా కథ రాసుకున్న 'మెగా' సినిమాకు వాళ్లు కాపీరైట్స్ అడగడమేంటని ప్రశ్నించాడు. రూ.2 కోట్లు ఇవ్వమని అడిగారు. నేను జనాలకు ఇస్తానే తప్ప బ్లాక్‌మెయిల్ చేసేవారికి అసలే ఇవ్వను అన్నాడు. నిజాలు బయటకు వచ్చాయి కాబట్టే తనకు బెయిల్ వచ్చిందని పేర్కొన్నాడు.
అసలేం జరిగింది?
పెళ్లిపేరుతో హర్షసాయి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ యువతి సెప్టెంబర్‌లో పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా తన దగ్గర రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. అప్పటినుంచి హర్షసాయి పరారీలో ఉన్నాడు.
సోషల్ మీడియాలో మాత్రం తాను తప్పు చేయలేదని, న్యాయం కోసం పోరాడతానని పోస్టు పెట్టాడు. అజ్ఞాతంలో ఉండే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశాడు. తనపై పెట్టిన కేసు చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా మెగా సినిమా కాపీరైట్స్ విషయంలోనే హర్షసాయికి, ఆ మూవీలో నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న యువతికి విభేదాలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment