‘‘తాతయ్య కృష్ణగారు, మావయ్య మహేశ్‌బాబుగారి వారసత్వాన్ని కంటిన్యూ చేయడం ఓ బాధ్యతగా భావించి డ్యాన్స్, యాక్షన్‌లో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నాను. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి? ధైర్యంగా ఎలా నిలబడాలి? అని మహేశ్ మావయ్య సలహాలు ఇచ్చారు. తాతయ్య నుంచి డేరింగ్ అండ్ డాషింగ్, మహేశ్ మావయ్య నుంచి సెన్సాఫ్ హ్యూమర్, టాలెంట్, ఇంటెలిజెంట్, షార్ప్‌నెస్ నేర్చుకున్నాను’’ అని అశోక్ గల్లా అన్నారు.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘హీరో’. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో గల్లా పద్మావతి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గల్లా అశోక్ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి వస్తానన్నప్పుడు అమ్మ (పద్మావతి), నాన్న (జయదేవ్) ఒకరోజు సక్సెస్ ఉంటుంది.. ఇంకోరోజు ఉండదు. ఎత్తు పల్లాలుంటాయి అవసరమా? అన్నారు. నా నిర్ణయాన్ని బలంగా చెప్పడంతో ప్రోత్సహించి ‘హీరో’ చిత్రంతో నన్ను పరిచయం చేస్తున్నారు.
నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు తాతయ్య ‘పచ్చని సంసారం’ సినిమా చేశా. ఆ తర్వాత మహేశ్ మావయ్య ‘నాని’ సినిమాలో నటించినప్పుడు నాకు సినిమాలపై ఆసక్తి కలిగింది. ‘హీరో’ కమర్షియల్ సినిమా కాబట్టి శ్రీరామ్ ఆదిత్య నాకు ఎక్కువగా చిరంజీవిగారి సినిమాలను రిఫరెన్స్‌గా ఇచ్చారు. ఓ మధ్య తరగతి అబ్బాయి హీరో అవ్వాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కథ. నాకు రాజకీయాలు, వ్యాపారాలంటే ఇష్టం లేదు. నటనపైనే నా దృష్టి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment