
తమిళసినిమా: టాలీవుడ్‌లో ఏ తరహా పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు కార్తీ. ప్రస్తుతం విరుమన్ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఓ చిత్రం కోసం కొత్తగా మేకోవర్ అవుతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్ తొలి భాగం సెప్టెంబర్ 30వ తేదీ భారీ అంచనాల మధ్య విడుదలకు ముస్తాబవుతోంది. కాగా కార్తీ నటిస్తున్న మరో చిత్రం సర్దార్. ఇందులో ఈయన ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. దీంతో పాటు కార్తీ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. రాజుమురుగన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇంతకు ముందు కుక్కూ, జోకర్, జిప్సీ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించిన ఈయన దర్శకత్వం శైలి విభిన్నంగా ఉంటుంది. రాజుమురుగన్ చిత్రాల్లో నటులు కనపడరు, పాత్రలే కనపడతాయి. అదే విధంగా కమర్షియల్ అంశాల కంటే కథకే ప్రాధాన్యతనిచ్చే దర్శకుడీయన. కార్తీని ఇంతకు ముందు చిత్రాలకు భిన్నంగా ఇందులో చూపించబోతున్నట్లు సమాచారం.
ఈ కొత్త కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్‌ఆర్.ప్రభు, ఎస్‌ఆర్.ప్రకాశ్‌బాబు నిర్మించనున్నారు. రాజుమురుగన్ దర్శకత్వంలో నటించడానికి కార్తీ కొత్తగా మేకోవర్ అవుతున్నారు. అదే విధంగా ఈ చిత్రం కోసం రిహార్సల్స్ అవుతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment