విశాఖపట్నం (భీమిలి): ‘తరంగణి’ సినిమాతో తెలుగులో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి.. తిరుగులేని కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అందాల నటుడు సుమన్. సుమన్‌గా సుపరిచితుడైన తల్వార్ సుమన్ గౌడ్ దక్షిణ భారత సినీ నటుడు. తెలుగు, తమిళ్, కన్నడ, ఆంగ్ల, ఒడియా తదితర భాషల్లో నటించారు. కరాటేలో నిష్ణాతుడైన సుమన్ తెలుగులో పెద్ద యాక్షన్ హీరో. లవర్‌బాయ్, కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అన్నమయ్య సినిమాలో పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్ర, శ్రీరామదాసు చిత్రంలో పోషించిన రాముడి పాత్ర మరపురానివి. పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఆయనతో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ.
సాక్షి: చిరంజీవికి మీకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా?
సుమన్: చిరంజీవికి నాకు విభేదాలు ఉన్నాయని అనుకోవడం పొరపాటే. మేమంతా ఒకే కుటుంబం. అదే సినీ కుటుంబం. నాకు ఎవ్వరితోనూ విభేదాలు లేవు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 1980 బ్యాచ్ అంటే చిరంజీవి, వెంకటేష్ రజినీకాంత్, భానుచందర్, సుహాసిని, సుమలత, రాధిక తదితర నటులందరం కలుసుకుంటాం. ఇక్కడ అందరం స్నేహ పూర్వకంగానే ఉంటాం.
సాక్షి: సినీ ఇండస్ట్రీ వైజాగ్‌కు ఎప్పుడు వస్తుంది?
సుమన్: సినీ పరిశ్రమ ఎక్కడ ఉన్నా.. ఎంత పెద్ద సినిమా అయినా.. సినిమా చిత్రీకరణలో విశాఖ ఒక భాగంగా మారింది. సినీ పరిశ్రమకు వైజాగ్ అనుకూలం. అరకు, బీచ్‌రోడ్డు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ సహజ వనరులు ఉన్నప్పటికీ సినిమా నిర్మాణానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పూర్తిగా వైజాగ్‌లో చిత్రీకరించే వారికి రాయితీ అందించాలి. వైజాగ్‌లో స్టూడియోలు నిర్మించాలని సినీ పరిశ్రమను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆహ్వనించారు. ఇక్కడ ఫిల్మ్ స్టూడియోలు నిర్మించినప్పుడే.. సినీ ఇండస్ట్రీ వైజాగ్‌కు వచ్చే అవకాశాలు ఉంటాయి.
సాక్షి: తెలుగులో ఏ సినిమాతో మీరు అరంగేట్రం చేశారు?
సుమన్: 1978లో నేను సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. తమిళ్‌లో నా ఫస్ట్‌మూవీ స్విమ్మింగ్‌పూల్(నీచల్ కులం). 1982లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాను. తరంగణి నా మొదటి తెలుగు సినిమా.
సాక్షి: మీ 44 ఏళ్ల సినీ ప్రయాణం ఎలా సాగింది?
సుమన్: ఈ 44 ఏళ్లలో ఎన్నో అవాంతరాలు, కష్టాలు ఎదుర్కొన్నాను. ఒక్కసారిగా హీరో నుంచి జీరో స్థాయికి చేరుకున్న సందర్భం కూడా ఉంది. భగవంతుడి దయతో మరల హీరో స్థాయికి చేరుకున్నాను. అగ్రకథానాయకులు రజినీకాంత్, కమల్‌హాసన్ వంటి నటులతో నటించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఈ ప్రయాణంలో ఒడిదొడుకులు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడిన నాడే నిజ జీవితంలో హీరోగా నిలుస్తాం.
సాక్షి: ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు?
సుమన్: హీరోగా, విలన్‌గా 10 భాషల్లో 600లకుపైగా సినిమాల్లో నటించాను.
సాక్షి: తెలుగులో మళ్లీ హీరోగా చేస్తున్నారా?
సుమన్: సినిమాలో కథ, కథనం బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. తెలుగులో హీరోగా 101వ సినిమా సంగప్పలో నటిస్తున్నాను. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో సినిమా సిద్ధన్నగట్టులో నటిస్తున్నాను.
సాక్షి: అప్పట్లో ఒక హీరో ఏడాదికి 10 సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. ఎందుకని?
సుమన్: నిజమే. హీరోగా నేను అప్పట్లో ఒక్క ఏడాదిలో 11 సినిమాలు చేశాను. అప్పట్లో అవుట్‌డోర్‌లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఇండోర్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 9 గంటల వరకు కష్టపడేవాళ్లం. షెడ్యూల్‌ను సర్దుబాటు చేస్తూ సినిమాల్లో నటించేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. ఒక సినిమాలో నాలుగు సీన్లు తీస్తే ఓ రోజు అయిపోతుంది. ఈ రోజుల్లో కనీసం రోజుకు 12 గంటలు కష్టపడితే .. ఏడాదికి ఐదు సినిమాలు తీసే అవకాశం ఉంటుంది.
సాక్షి: నేడు సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. దీనికి కారణం?
సుమన్: ఏ సినిమాకైనా ప్రస్తుతం కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నారు. నిర్మాణ వ్యయం తగ్గించుకుంటే సినిమా కొనుగోలుదారులకు సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా కాస్త ఊరట కలుగుతుంది. కథకు మించి నటులను పెట్టడం.. దేశ, విదేశాల్లో చిత్రీకరణ వలన నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది.
సాక్షి: చిన్న సినిమా వాళ్ల పరిస్థితి ఏంటి?
సుమన్: చిన్న బడ్జెట్‌తో కొత్త నటీనటులతో తీసే సినిమాలను ప్రోత్సహించాలి. చిన్న సినిమా వాళ్లకు ఎక్కడ రిలీజ్ అయినా రాయితీ, పరి్మషన్లు ఇచ్చినట్లయితే.. వారికి ఇబ్బందులు తొలుగుతాయి.
సాక్షి: ప్రస్తుతం మిగతా భాషల్లో నటిస్తున్నారా?
సుమన్: ప్రస్తుతం కన్నడలో 3, తమిళంలో 1 హీరో, విలన్ పాత్రల్లో నటిస్తున్నాను.
సాక్షి: మీ వారసులు సినీ పరిశ్రమ వైపు ఎందుకు రాలేదు?
సుమన్: నాకు ఒక అమ్మాయి. పేరు ప్రత్యూష. తను వైద్య రంగంలో మంచి స్థాయిలో ఉంది. హ్యూమన్ జెనిటిక్స్‌లో గోల్డ్ మెడలిస్ట్. సినీ పరిశ్రమ వైపు తనకు ఆసక్తి లేకపోవడంతో వైద్య రంగం వైపు అడుగులు వేసింది.
సాక్షి: రాష్ట్రంలో ప్రభుత్వపాలనపై మీ అభిప్రాయం?
సుమన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనలో పేదలు, మధ్య తరగతి ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అమలు తీరు బాగుంది. ప్రభుత్వం వారికి ఆసరా అందిస్తోంది.
సాక్షి: మీరు రాజకీయాల్లోకి వస్తారా?
సుమన్: కళామతల్లి ఆశీస్సులతో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పటివరకు లేదు.
Comments
Please login to add a commentAdd a comment