తమిళసినిమా: పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించిన నటీమణుల గురించి ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద చర్చ జరుగుతోంది. చారిత్రక కథా చిత్రంలో నేటి తారలు ఎలా నటించారు, దర్శకుడు మణిరత్నం వారిని పాత్రలకు తగ్గట్టుగా ఎలా మలిచారు? అన్న ఆసక్తి సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అయితే ఇందులో పాత్రధారులు అందరూ మణిరత్నం చెప్పినట్లు చేశామని భారం అంతా ఆయనపైనే మోపేస్తున్నారు. ఈ చిత్రంలో కుందవైగా ముఖ్యపాత్రలో నటించిన త్రిష ఇందుకు అతీతం కాదు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించిన అనుభవాలను ఈ బ్యూటీ తెలుపుతూ నటీనటులందరం షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టగానే పొన్నియిన్ సెల్వన్ చిత్ర కథలోని పాత్రలుగా మారిపోయే వాళ్లమన్నారు.
అందువల్లే ఇంతకుముందు తాను నటుడు జయంరవి సరసన రెండు చిత్రాలలో కథానాయికగా నటించినా ఈ చిత్రంలో సహోదరిగా నటించగలిగానన్నారు. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన చారిత్రక కథా చిత్రం కావడంతో దుస్తులు, నడక, హావభావాలు అన్ని మార్చాల్సి వచ్చిందన్నారు. ఈ చిత్రంలోని కుందవై పాత్ర కోసం తాను ఆరు నెలలు ఇంట్లోనే రీహార్సిల్స్ చేశానని చెప్పారు. ఆ పాత్రకు సంబంధింన పలు విషయాలు తెలుసుకున్నానని, ఇక దుస్తులు, ఆభరణాలు, మేకప్ విషయానికి వస్తే టెస్ట్‌లు చేసి చివరికి కుందవైగా మారాయన్నారు.
చిత్రంలో నటి ఐశ్వర్యారాయ్‌తో నటించే సన్నివేశాలు చాలానే ఉన్నాయన్నారు. ఆమెతో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఆ సన్నివేశాలు బాగా వచ్చాయని, సహ నటీనటులు చెప్పడంతో ఆనందం కలిగిందన్నారు. అయితే దర్శకుడు మణిరత్నం చెప్పినట్లే తాను నటించానని చెప్పారు. ముఖ్యంగా అచ్చ తమిళ భాషలో సంభాషణలు చెప్పాల్సి రావడంతో నోరుతిరగలేదన్నారు. దీంతో భావోద్రేకాలు ప్రదర్శించడం సాధ్యం కాలేదని చెప్పారు. దీంతో మణిరత్నం సరళమైన భాషలో సంభాషణలను మార్చారన్నారు. ఈ చిత్రంలో కుందవై పాత్రలో నటించి చాలా నేర్చుకున్నానన్నారు. కుందనై చాలా దైర్యవంతురాలని, ఇకపై తాను ఆమెను అనుసరిస్తానని నటి త్రిష పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment