కోలీవుడ్‌ హిట్‌ సినిమాలు హిందీలోనూ హిట్‌ ఆవుమా?  | Hindi remakes of Tamil hit films | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో సక్సెస్‌ అయిన సినిమాలు బాలీవుడ్‌కు.. హిందీలో వర్కవుట్‌ అవుతుందా?

Published Fri, Aug 11 2023 12:17 AM | Last Updated on Fri, Aug 11 2023 7:00 AM

Hindi remakes of Tamil hit films - Sakshi

ఓ సినిమా హిట్‌ అయితే... ఆ సినిమాలోని కథ ఏ భాషకైనా, ప్రాంతానికైనా నప్పే విధంగా ఉంటే.. అందరి దృష్టీ ఆ సినిమా మీద పడుతుంది. అలా తమిళంలో హిట్టయిన చిత్రాల మీద హిందీ పరిశ్రమ దృష్టి పడింది. ఆ చిత్రాల రైట్స్‌ చేజిక్కించుకుని, రీమేక్‌ చేస్తున్నారు. మరి.. తమిళంలో హిట్‌ ఆన (అయిన) సినిమా హిందీలోనూ హిట్‌ ఆవుమా? (అవుతుందా?) అంటే.. వేచి చూడాల్సిందే. ఇక హిందీలో రీమేక్‌ అవుతున్న తమిళ చిత్రాల గురించి తెలుసుకుందాం. 

విమానయానం
ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు కెప్టెన్‌ జీఆర్‌ గోపీనాథ్‌ జీవితంతో సుధ కొంగర దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా’). సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజై, మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా హిందీ రీమేక్‌లో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నారు. సుధా కొంగరే రీమేక్‌ను డైరెక్ట్‌ చేస్తున్నారు.

ఈ  రీమేక్‌కు సూర్య ఓ నిర్మాతగా ఉండటం విశేషం. సామాన్యులు సైతం విమానయానం చేసేందుకు గోపీనాథ్‌ ఏ విధంగా కృషి చేశారు? ఎలాంటి సవాళ్లను  ఎదుర్కొన్నారు? అనేది ‘సూరరై పోట్రు’ కథాంశం. అలాగే విజయ్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కత్తి’ (2014) రీమేక్‌లో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తారని సమాచారం. హిందీ రైట్స్‌ను దర్శక–నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ దక్కించుకున్నారు.

హిందీ అపరిచితుడు
 విక్రమ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నియన్‌’ (‘అపరిచితుడు’) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు శంకర్‌ ప్రకటించారు. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించాల్సింది. కొన్ని లీగల్‌ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై మానసిక వేదనకు గురైన ఓ మధ్యతరగతి యువకుడు ఏం చేశాడు? అనేది ఈ చిత్రం కథాంశం. 

గ్యాంగ్‌స్టర్‌ సెంటిమెంట్‌ 
చెల్లెలి సంరక్షణ కోసం ఓ గ్యాంగ్‌స్టర్‌ తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడు? ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్లలకు ఎలా బుద్ధి చెప్పాడు? అనే అంశాలతో రూపొందిన తమిళ చిత్రం ‘వేదాళం’. అజిత్‌ హీరోగా శివ దర్శకత్వంలో 2015లో విడుదలైన ఈ సినిమా హిట్‌ సాధించింది. ఈ సినిమా ‘వేద’గా హిందీలో రీమేక్‌ అవుతోంది. జాన్‌ అబ్రహాం టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. నిఖిల్‌ అద్వానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్స్‌ తమన్నా, శర్వారి లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. జాన్‌ అబ్రహాం సిస్టర్‌గా శర్వారి, హీరోయిన్‌గా తమన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది.  

16ఏళ్లు కోమాలో ఉంటే.
దాదాపు 16 సంవత్సరాలు కోమాలో ఉన్న ఓ వ్యక్తి ఆరోగ్యం హఠాత్తుగా కుదుటపడుతుంది. కోమా నుంచి బయటకు వచ్చిన అతను సమకాలీన నాగరికత, జీవన విధానం, టెక్నాజీలను చూసి ఆశ్చర్యపో తాడు. ఈ పరిస్థితులను అతడు తన జీవితానికి ఎలా అన్వయించుకున్నాడు? తన పూర్వీకులకు చెందిన ఓ విగ్రహం అతని జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది? అన్నది ‘కోమాళి’ కథనం. ‘జయం’ రవి హీరోగా ప్రదీప్‌ రంగనాథన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2019లో విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్‌ హక్కులను బోనీ కపూర్‌ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో అర్జున్‌ కపూర్‌ హీరోగా నటిస్తారని బాలీవుడ్‌లో ఎప్పట్నుంచో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.  

ఇటు పోలీస్‌.. అటు ఎన్‌ఆర్‌ఐ 
బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ఇటీవల రీమేక్స్‌ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తన్న ఓ సినిమాలో వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. తమిళ దర్శకుడు కాలిస్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2016లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన తమిళ హిట్‌ ఫిల్మ్‌ విజయ్‌ ‘తేరి’కి ఇది హిందీ రీమేక్‌ అని బాలీవుడ్‌ సమాచారం.

ఓ రాజకీయ నాయకుడి కుమారుడు ఓ యువతిపై అత్యాచారం చేస్తే, అతన్ని చంపేస్తాడు ఓ పో లీసాఫీసర్‌. అప్పడు ఆ రాజకీయ నాయకుడు ఆ పోలీసాఫీసర్‌పై ఏ విధంగా పగ తీర్చుకున్నాడు? ఆ రాజకీయ నాయకుణ్ణి ఆ పోలీసాఫీసర్‌ ఎలా ఢీ కొన్నాడు? అన్నదే టూకీగా ‘తేరి’ కథాంశం. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా వరుణ్‌ ధావన్‌ నటిస్తున్నారు.

అలాగే మరో తమిళ హిట్‌ ‘మనాడు’ హిందీ రీమేక్‌లో కూడా వరుణ్‌ ధావన్‌ నటించనున్నారనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. శింబు, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మానాడు’. ఈ సినిమా హిందీ రీమేక్‌ రైట్స్‌ రానా వద్ద ఉన్నాయి. ఓ ఎన్‌ఆర్‌ఐకి, పో లీసాఫీసర్‌కి మధ్య కొన్ని రాజకీయ అంశాల నేపథ్యంలో ఎలాంటి శత్రుత్వం ఏర్పడింది? అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. ఎన్‌ఆర్‌ఐగా శింబు నటించగా, పోలీసాఫీసర్‌గా ఎస్‌జే సూర్య నటించారు.  

ట్రెండీ లవ్‌స్టోరీ 
రూ. 5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొంది, బాక్సాఫీస్‌ వద్ద రూ. 50 కోట్లకుపైగా కలెక్షన్స్‌ను సాధించిన తమిళ ట్రెండీ లవ్‌స్టోరీ ‘లవ్‌ టుడే’. ప్రదీప్‌ రంగనాథన్‌ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇవానా హీరోయిన్‌. గత ఏడాది నవంబరులో విడుదలైన ఈ సినిమా హిందీ రీమేక్‌ను ఫ్యాంథమ్‌ స్టూడియోస్, ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మించనున్నాయి.

ఇందులో హీరో హీరోయిన్లుగా ఆమిర్‌ ఖాన్‌ పెద్ద కొడుకు జైనైద్‌ ఖాన్, శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌లు ఫైనల్‌ అయ్యారని, షూటింగ్‌ కూడా మొదలైందని బాలీవుడ్‌ సమాచారం. ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి పరస్పర అంగీకారంతో వారి మొబైల్‌ ఫోన్స్‌ను మార్చుకున్నప్పుడు ఏం జరిగింది? అనే అంశంతో ‘లవ్‌ టుడే’ చిత్రం రూపొందింది. 
ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని తమిళ సినిమాలు కూడా హిందీలో రీమేక్‌ కానున్నాయని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement