ఊహకు రెక్కలొస్తే కాదేదీ కథకు అనర్హం అన్న నానుడి సరిగ్గా ఈ సినిమాకి సరిపోతుంది. మరి రచయిత అంత వైవిధ్యంతో ఆలోచించాడు. సినిమా పేరు ఐఎస్ ఎస్, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నమాట. ఇది చదవగానే ఇంకేముంది అంతరిక్ష ప్రయాణంతో ముడిపడిన కథ అని అనుకుంటారు. అలా అయితే రచయిత గురించి ఊసెందుకు. అసలా రచయిత ఊహ నిజంగా జరిగితే... ఆ ఆలోచనకే ఒకింత గగుర్పాటు వస్తుంది. ఈ సినిమా రచయిత నిక్ షఫీర్. దర్శకులు గేబ్రియలా.
ఇక కథ విషయానికి వద్దాం. అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్ అమెరికా మరియు రష్యా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి. ఐఎస్ ఎస్ సినిమా ప్రారంభం కాగానే స్పేస్ స్టేషన్ లో అమెరికా వ్యోమగాములు రష్యా వ్యోమగాములకు స్వాగతం పలుకుతుంటారు. అందరూ ఆనందంగా స్పేస్ స్టేషన్ లో కలుస్తారు. ఇంతలో ఓ అమెరికా వ్యోమగామి భూమి వైపు చూసి మిగతా వారినందరినీ అలర్ట్ చేస్తుంది. భూమి మీద భయంకరమైన విస్ఫోటనాలు జరుగుతుంటాయి. వీరికి అర్ధం కాక భూమిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంత సమయం తరువాత భూమి పై అణు యుద్ధం ప్రారంభమైందని స్పేస్ స్టేషన్ తమ ఆధీనం చేసుకోవాలని వారి వారి దేశం వాళ్ళకు వర్తమానం పంపుతారు.
ఉందేది అంతరిక్షలో, అదీ రెండు దేశాలకు సంబంధించి వ్యోమగాములు ఒకే స్పేస్ స్టేషన్ లో. భూమి మీద యుద్ధం. ఇదే యుద్ధం అప్పటి నుండి స్పేస్ స్టేషన్ లో కూడా ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో కుట్రలేంటి, ఎవరి మీద ఎవరు గెలిచారు, ఆఖరికి స్పేస్ స్టేషన్ ఎవరు చేజిక్కించుకున్నారు అన్నది ఐఎస్ ఎస్ సినిమాలో చూడాల్సిందే. దర్శకుడు లాగ్ లేకుండా పాయింట్ ని మంచి స్క్రీన్ ప్లే తో థ్రిల్లింగ్ గా చిత్రీకరించారు. ఐఎస్ ఎస్ సినిమా మంచి వీకెండ్ మూవీ. ఈ సినిమా జియో సినిమా ఓటిటి ప్లాట్ ఫాం వేదికగా స్ట్రీం అవుతోంది.
- ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment