Actress Shalu Chourasiya Attacked at KBR Park: సినీనటి షాలూ చౌరాసియాపై దాడికి పాల్పడిన ఆగంతుకుడు.. ఆ తర్వాత నాలుగు గంటల పాటు ఆ పరిసరాల్లోనే సంచరించినట్లు టవర్ లొకేషన్‌లో సిగ్నళ్లు స్పష్టం చేస్తుండటం కీలకంగా మారింది. సుమారు 4 గంటల పాటు అదే ప్రాంతంలో దుండగుడు తచ్చాడటం అంతు చిక్కని మిస్టరీగా మారింది. కాగా.. ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు పలు కీలక ఆధారాలు పోలీసులకు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి..
కాచుకుని.. వెనక నుంచి వచ్చి..
► అది కేబీఆర్ పార్కు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలు. సినీనటి షాలూ చౌరాసియా జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో వాకింగ్‌కు వచ్చింది. 8.44 గంటలకు ఆమె స్టార్‌బక్స్ హోటల్ ముందు వాక్‌వేలో వాకింగ్ చేస్తోంది. అప్పటికే అక్కడ కాచుకొని ఉన్న దుండగుడు వెనకాల నుంచి వచ్చి ఆమెను కిందకు తోసేసి దాడికి పాల్పడ్డాడు. పది నిమిషాల పాటు పెనుగులాడిన ఆమె డయల్ 100కు ఫోన్ చేసింది. పోలీసులకు సమాచారం ఇస్తున్న సమయంలోనే దుండగుడు ఆమె చేతుల్లో నుంచి ఫోన్ లాక్కున్నాడు. అదే సమయంలో ఆమె బయటికి పరుగులు తీసింది.
► 9.14 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న పోలీసులు స్టార్‌బక్స్ హోటల్ వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే బాధితురాలికి స్నేహితుడు, తల్లి అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం ఫోన్ లాక్కున్న దుండగుడు అక్కడి నుంచి నేరుగా వాక్‌వేలో నడుచుకుంటూనే సీవీఆర్ న్యూస్, జర్నలిస్టు కాలనీ, బాలకృష్ణ నివాసం వరకు వెళ్లాడు.
► బాలకృష్ణ ఇంటి వద్ద గేటులో నుంచి బయటికి వచ్చి ఫుట్‌పాత్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు వైపు నడక సాగించాడు. నెక్సా షోరూం ఎదురుగా ఉన్న కేబీఆర్ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వే పార్కింగ్‌స్థలంలో చిచ్చాస్ హోటల్ వద్దకు ఒంటిగంటకు చేరుకున్నాడు ఆ హోటల్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంటకు ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లుగా టవర్ సిగ్నల్ ద్వారా పోలీసులు గుర్తించారు.
బాధితురాలి ఫోన్ డేటా పరిశీలన..
► రాత్రి 9 గంటలకు నటిపై దాడి చేసిన అనంతరం నిందితుడు నాలుగు గంటల పాటు ఆ పరిసర ప్రాంతాల్లానే తచ్చాడినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసు బృందాలు పార్కు చుట్టూ రోడ్లపై గాలింపు చేపట్టి ఉంటే నిందితుడు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి కేబీఆర్ పార్కు వైపు ఫుట్‌పాత్‌పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే
గుర్తించి ఉండేవారు.
► పార్కు చుట్టూ పోలీసు బృందాలు అదే రాత్రి జల్లెడ పట్టి అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులను ప్రశ్నించి ఉంటే దుండగుడి ఆచూకీ తెలిసి ఉండేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. పలు అనుమానాలకు తావిస్తున్న ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. బాధితురాలి ఫోన్ కాల్ డేటా పరిశీలించగా 9 గంటల ప్రాంతంలో ఆమె డయల్ 100కు ఫోన్ చేసినట్లు గుర్తించారు. సమీపంలో ఉన్న మైలాన్ ల్యాబ్ సెల్‌టవర్ ఈ సిగ్నల్‌ను బహిర్గతం చేసింది. నిందితుడు నాలుగు గంటల పాటు అదే ప్రాంతంలో ఎలా తిరిగాడదన్నది అంతుచిక్కని విషయంగా మారింది.
ఇంటర్‌సెప్టార్ జాడే లేదు..
ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ఇంటర్‌సెప్టార్ ఫుట్ పెట్రోలింగ్ పోలీసులు విధులు ముగిస్తారు. ఆదివారం రాత్రి నటి చౌరాసియాపై 8.44 గంటలకు దాడి జరగగా 9 గంటలకు ఆమె ఫెన్సింగ్ దూకి బయటికి వచ్చింది. ఆ సమయంలో ఫుట్‌పెట్రోలింగ్ పోలీసుల జాడే లేకపోవడం గమనార్హం.
షాక్ నుంచి తేరుకోని చౌరాసియా..
దుండగుడి చేతిలో గాయాలపాలైన షాలూ చౌరాసియా ప్రస్తుతం వణికిపోతోంది. ‘నేను వదలను.. చంపేస్తాను’ అనే ఆగంతుకుడి బెదిరింపులు గుర్తుకొచ్చి గజగజలాడుతోంది. దాడి ఘటన అనంతరం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొంది కొండాపూర్‌లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. దుండగుడికి సంబంధించిన వివరాలపై ఆమెతో మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
నామమాత్రపు నిఘా నేత్రాలు
రాజకీయ ప్రముఖులు, సినీనటులు, పారిశ్రామికవేత్తలతో పాటు వీవీఐపీలు వాకింగ్ చేసే బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నామమాత్రంగానే పని చేస్తున్నాయి. మంగళవారం పార్కులోని కెమెరాలు ఎంత వరకు పని చేస్తున్నాయన్నదానిపై పరిశీలన చేపట్టారు. 42 సీసీ కెమెరాల్లో 25 మాత్రమే పని చేస్తున్నట్లుగా తేలింది.
కేబీఆర్ పార్కులో పోలీసుల నిఘా
వెంకటేశ్వరకాలనీ: గత ఆదివారం రాత్రి సినీ నటి షాలూ చౌరాసియాపై కేబీఆర్ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో ఆగంతుకుడు దాడి చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం కేబీఆర్ పార్కులోనూ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాకర్లకు మరింత ధైర్యాన్నిస్తూ పలు ప్రాంతాల్లో నిఘాలో పెట్టారు. మరోవైపు పార్కు బయట జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో సైతం పోలీసు బలగాలను మోహరించారు. వాకర్లకు, సందర్శకులకు తామున్నామని భరోసా కల్పిస్తూ సాయుధ బలగాలు పహారా కాశాయి.
Comments
Please login to add a commentAdd a comment