Ilayaraja Condolences To Sirivennela Sitarama Sastry Death - Sakshi
Sakshi News home page

Sirivennela Sitarama Sastry: సిరివెన్నెల మృతిపై ఇళయరాజా ఆవేదన

Published Wed, Dec 1 2021 3:13 PM | Last Updated on Wed, Dec 1 2021 4:00 PM

Ilayaraja Condolences To Sirivennela Sitarama Sastry - Sakshi

Ilayaraja Condolence To Sirivennela Sitarama Sastry: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్మరణం దేశవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులను, చలన చిత్ర పరిశ్రమలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. పండితుల నుంచి సామాన్యుల వరకు సిరివెన్నెల సాహిత్యం ప్రభావితం చేయగా.. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సిరివెన్నెల మృతిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

చదవండి: సిరివెన్నెలను వరించిన 11 నంది అవార్డులు.. ఆ పాటలు ఇవే..

కాగా ఇళయరాజా, సిరివెన్నెలు దశాబ్దాల పాటు పనిచేశారు. ఇళయరాజా స్వరాలకు సిరివెన్నెల సాహిత్యం తోడై అద్భుతం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో ఇళయరాజా మిత్రుడు సిరి వెన్నెలకు పదాలతో నీరాజనం తెలిపారు. ‘మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయని చెప్పారు. ఆయన పాటల పదముద్రలు తన హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయని తెలిపారు. సినిమా పాటల్లో సైతం కవితాత్మని, కళాత్మకతని అందించి తనదైన ముద్రతో అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలను అందించారని చెప్పారు. శ్రీ వేటూరి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న  సరస్వతీ పుత్రుడు...

చదవండి: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం

సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు..
పాటతో అంతర్యుద్ధం చేస్తాడు..
పాటలో అంతర్మథనం చెందుతాడు..
పాటని ప్రేమిస్తాడు..
పాటతో రమిస్తాడు..
పాటని శాసిస్తాడు..
పాటని పాలిస్తాడు.. 
పాట నిస్తాడు....

‘మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ  గుర్తుంటాయి.. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి. నాతో శివ తాండవం చేయించాయి.. ‘వేటూరి’ నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే... ‘సీతారాముడు’ నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు.. ధన్యోస్మి మిత్రమా..! ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది.. పాటకోసమే బ్రతికావు,బ్రతికినంత కాలం పాటలే రాశావు....ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ ఇళయరాజా సిరివెన్నెలకు అంతిమ వీడ్కోలు తెలిపారు.

కాగా మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 2:26 గంటలకు ముగిశాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి  మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో  పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement