తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ(Income Tax Officer) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్‌ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.
సినిమాల ఆదాయం లెక్కలపై ఫోకస్
ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్‌రాజు నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలకు అయిన ఖర్చు, వచ్చిన వసూళ్లు తదితర అంశాలపై ఐటీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. దిల్‌రాజు ఇంటితోపాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను, ఐటీ చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లను ఐటీ అధికారులు స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం.
(ఇదీ చదవండి: సైఫ్ అలీఖాన్‌కు రక్షణగా 'జై లవకుశ' నటుడి టీమ్)
ఇక పుష్ప–2 సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు చెందిన మైత్రీ నవీన్, యలమంచిలి రవిశంకర్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. పుష్ప–2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఐటీ చెల్లింపులకు సంబంధించి అధికారులు పలు ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా పుష్ప2(Pushpa 2) , గేమ్ ఛేంజర్(Game Changer Movie) కలెక్షన్ల ప్రకటనతో అందుకు సంబంధించిన చెల్లింపుల వివరాల గురించి వారు పరిశీలించినట్లు తెలుస్తోంది.
సాధారణంగా జరిగే సోదాలే: దిల్‌రాజు భార్య వైగారెడ్డి
తనిఖీల్లో భాగంగా ఐటీ అధికారులు దిల్‌రాజు సతీమణి వైగారెడ్డిని తమ కారులో తీసుకెళ్లారు. దిల్‌రాజు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు. బ్యాంకు లాకర్లను పరిశీలించిన అనంతరం ఆమెను తిరిగి అదే వాహనంలో ఇంటివద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఐటీ సోదాలపై వైగారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇవి సాధారణంగా జరిగే సోదాలు మాత్రమేనని చెప్పారు. బ్యాంకు ఖాతాల వివరాలు కావాలని అధికారులు అడిగారని, అవి ఇచ్చామని, బ్యాంకు లాకర్లు తెరిచి చూపించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment