బెంగాలీ తెర ప్రథమ మహిళగా చెప్పుకునే కానన్ దేవి ఇప్పటితరానికి తెలిసే ఆస్కారమే లేదు. చిన్నతనంలోనే సింగర్‌గా, నటిగా వెండితెరపై అడుగుపెట్టిన ఆమె పురుషాధిపత్యం ఉన్న రోజుల్లోనే వెండితెరపై మకుటం లేని మహారాణిగా నిలిచింది. రంగుల ప్రపంచంలో ఎన్నో విజయాలు చూసిన ఆమె నిజ జీవితంలో మాత్రం కన్నీటి కష్టాల సుడిగుండాలను దాటుకుంటూ ముందుకు సాగింది. ప్రేక్షకలోకానికి వినోదం పంచిన ఈ స్టార్ హీరోయిన్ 1992లో అనాధగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. అసలు ఎవరీ కానన్ దేవి? తన జీవిత కథ, వ్యధ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
తండ్రి మరణంతో ఆర్థిక కష్టాలు
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది కానన్ దేవి. 1916 ఏప్రిల్ 22న ఆమె ఈ లోకంలోకి అడుగుపెట్టినప్పుడు తను కోటీశ్వరురాలవుతుందని ఎవరూ ఊహించలేదు. రతన్ చంద్రదాస్, రాజోబాలదాస్ ఈమె తల్లిదండ్రులు. తండ్రి దగ్గరుండి కానన్‌కు సంగీతంలో శిక్షణ ఇచ్చేవాడు. కొంతకాలానికే అతడు కన్నుమూయడంతో ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆర్థిక కష్టాలు కుటుంబాన్ని వెంటాడాయి. ఇంటి అద్దె కూడా కట్టకపోవడంతో ఇంటి యజమాన్ని కానన్ కుటుంబాన్ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు.
ఆరేడేళ్ల వయసులో పనిమనిషిగా మారిన కానన్
దిక్కు తోచని స్థితిలో ధనవంతుల ఇంట్లో పనిమనుషులుగా చేరారు తల్లీకూతుళ్లు. తలదాచుకోవడానికి నిలువ నీడ లేని వీరికి ఓ బంధువు ఇల్లు ఇచ్చి అందులో ఉండమన్నాడు. దేవుడిలా వచ్చి సాయం చేశాడనుకునేలోపే అతడు తన నిజస్వరూపం చూపించాడు. పట్టుమని ఏడేళ్లు కూడా లేని కానన్‌తో ఆమె తల్లితో బండచాకిరీ చేయించుకున్నాడు. వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది సహించలేకపోయిన కానన్ ఆ ఇంటి నుంచి తల్లితో పాటు బయటకు వచ్చేసింది.
బాలనటి నుంచి స్టార్ హీరోయిన్‌గా
ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో కోల్‌కతాను వదిలి తిరిగి హౌరా వెళ్లిపోయారు. వేశ్యాగృహాలకు సమీపంలో ఓ గది అద్దె తీసుకుని జీవించారు. వీరి కుటుంబ స్నేహితుడైన తులసి బెనర్జీ.. కానన్‌ను చూసి తను సినిమాల్లో రాణించగలదని గ్రహించాడు. అప్పుడు కానన్ వయసు 10 ఏళ్లు. మదన్ మూవీ స్టూడియో.. 'జైదేవ్' అనే సినిమాలో ఆఫర్ ఇచ్చింది. ఇందుకుగానూ కానన్ అందుకున్న నెల జీతం రూ.5/-. 1928-31 మధ్య బాలనటిగా పలు చిత్రాలు చేసింది. అదే సమయంలో గాయనిగానూ సత్తా చాటింది. శంకరాచార్య, రిషిర ప్రేమ్, జోరేబరత్, విష్ణుమాయ, ప్రహ్లాద్ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మురిపించింది. ఇందులో విష్ణుమాయ, ప్రహ్లాద్ సినిమాల్లో బాలనటుడిగా కనిపించింది.
(చదవండి: టాలీవుడ్‌లో హీరోలుగా రాణిస్తున్న ఈ అన్నదమ్ములను గుర్తుపట్టారా?)
మేడమ్ సర్ మేడమ్ అంతే..
21 ఏళ్లకే హీరోయిన్‌గా మారిన కానన్ అందానికి, నటనకు దాసోహం కాని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. తక్కువకాలంలోనే వెండితెర సూపర్‌స్టార్‌గా అవతరించింది. పాట పాడినందుకు రూ.1 లక్ష, సినిమాలో హీరోయిన్‌గా నటించినందుకు రూ.5 లక్షలు తీసుకునేది. మొత్తంగా కానన్ 40 పాటలు పాడగా దాదాపు 57 సినిమాలు చేసింది. హీరోలకు సలాం కొడుతున్న రోజుల్లో అందరిచేతా మేడమ్ అని పిలిపించుకున్న మొదటి హీరోయిన్ ఈవిడే! ఈమె దిగ్గజ నటులు కేఎల్ సెఘల్, పంకజ్ మాలిక్, ప్రథమేశ్ బరువా, పహరి సాన్యల్, చబీ బిస్వాస్, అశోక్ కుమార్ వంటి హీరోల సరసన నటించింది. హీరోలకు తీసిపోని రేంజులో కోటీశ్వరురాలిగా ఎదిగింది.
కలిసిరాని రెండు పెళ్లిళ్లు
కానన్ 1940 డిసెంబర్‌లో బ్రహ్మ సమాజ సభ్యులు హిరంబ చంద్ర మిత్ర కుమారుడు అశోక్ మిత్రాను పెళ్లాడింది. కానీ వీరి సంసార జీవితం సజావుగా సాగలేదు. పెళ్లైన ఐదేళ్లకే అతడికి విడాకులిచ్చింది. 1949లో బెంగాల్ గవర్నర్ దగ్గర ఏడీసీగా పని చేసిన హరిదాస్ భట్టాచార్జితో పెళ్లిపీటలెక్కింది. కానన్‌ను పెళ్లి చేసుకున్న హరిదాస్ దర్శకుడిగా తన లక్ పరీక్షించుకున్నాడు. కానీ అందరూ అతడిని కానన్ భర్తగానే గుర్తించారు. ఇది జీర్ణించుకోలేకపోయిన అతడు 1987 ఏప్రిల్ 4న భార్య ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. వీరిద్దరూ విడివిడిగా జీవించారు, అయితే విడాకులు మాత్రం తీసుకోలేదు. 1992 జూలై 17న కానన్ దేవి 76 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసింది. తనను చివరి చూపు చూసేందుకు కూడా హరిదాస్ రాకపోవడం గమనార్హం. ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఆమె అనాధగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. కానన్ దేవి చిత్రపరిశ్రమకు అందించిన సేవలను గుర్తించిన తపాలా శాఖ 2011లో ఆమె పేరిట ఓ స్టాంపును విడుదల చేసింది.
చదవండి: దృశ్యం నటి సీమంతం.. సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్
బోలెడన్నిసినిమాలు చేసినా ఇప్పటికీ బ్రేక్ రాలే.. అమ్మడి టైం ఎప్పుడు మారుతుందో!
Comments
Please login to add a commentAdd a comment