నిత్యా మీనన్.. ఏ పాత్ర పోషించినా అందులో సహజత్వం ఉట్టి పడుతుంది. అలాగని ఏ పాత్ర పడితే ఆ పాత్రను ఒప్పుకోదు. నటనకు మాత్రమే అవకాశం ఉన్న పాత్రల్నే ఎంచుకుంటూ వెబ్ స్క్రీన్ మీదా అభినయిస్తున్న ఆమె గురించి కొన్ని వివరాలు..
నిత్యా మీనన్ వాళ్లది బెంగళూరులో స్థిరపడిన మలయాళీ కుటుంబం. ఎనిమిదేళ్ల వయసులోనే.. ఫ్రెంచ్–ఇండియన్ ఆంగ్ల చిత్రం ‘హనుమాన్’లో నటించింది. ‘స్టార్క్ వరల్డ్ కేరళ’ అనే టూరిజం మ్యాగజైన్‌లో నిత్యా ఫొటో చూసిన మోహన్ లాల్.. ఆమెకు ‘ఆకాశ గోపురం’ అనే సినిమాలో అవకాశం ఇచ్చి మలయాళ చిత్రసీమకు పరిచయం చేశారు.
ఆ తర్వాత ‘జోష్’తో కన్నడంలో, ‘అలా మొదలైంది’ తో తెలుగులో, ‘నూట్రన్ బదు’ తో తమిళంలో, ‘మిషన్ మంగళ్’తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి అన్నీ భాషల్లోనూ సహజ నటిగా పేరొందింది నిత్యా. ఎన్నో అవార్డులూ అందుకుంది. పలు సినిమాల్లో పాటలు కూడా పాడి తన గాన ప్రతిభనూ చాటింది.
సినిమాల్లోనే కాదు.. సిరీస్, టీవీ షో ల్లోనూ తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. ‘బ్రీత్: ఇన్ టు ద షాడోస్’, ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ వెబ్ సిరీస్‌లతో అంతర్జాతీయంగా వెబ్ వీక్షకులను అబ్బురపరచింది. తెలుగులో ఇండియన్ ఐడల్ షోకి హోస్ట్‌గానూ వ్యవహరించింది.
‘స్కైలాబ్’ అనే చిత్రంతో నిర్మాతగా మారింది. ఈ మధ్యనే ఓ యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించి యూట్యూబ్ వరల్డ్‌లోకీ ఎంటర్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతోన్న ‘కుమారి శ్రీమతి’ సిరీస్‌తో అలరిస్తోంది. ఆమె ప్రధాన భూమిక పోషించిన మలయాళ వెబ్ సిరీస్ ‘మాస్టర్ పీస్’ కూడా స్ట్రీమింగ్‌కి రెడీగా ఉంది.
నేను పక్కా ట్రేడిషనల్. మన సంస్కృతిని చాలా గౌరవిస్తా. కానీ పెళ్లి విషయంలో నాకు స్థిరమైన అభిప్రాయం ఉంది. పెళ్లి.. సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడి ఉన్న సెటప్. నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. ఎవరైనా దానికి మించి ఆలోచించేవాళ్లు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. – నిత్యా మీనన్
Comments
Please login to add a commentAdd a comment