ఈ ఏడాది కింగ్‌ఖాన్ షారుక్ ఖాన్‌దే అని చెప్పాలి. ఆయన నటించిన రెండు చిత్రాలు(పఠాన్, జవాన్) సూపర్ హిట్‌గా నిలిచాయి. ఒక్కో సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే డంకీ. రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ కామెడీ డ్రామా మరికొద్ది గంటల్లో(డిసెంబర్ 21) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం...
► రాజ్ కుమార్ హిరాణీ-షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత షారుఖ్ నటించిన చిత్రమిది. ఆ రెండు చిత్రాలు యాక్షన్ జానర్‌లో తెరకెక్కాయి. డంకీ మాత్రం కామెడీ డ్రామా ఎంటర్‌టైనర్. అభిమానుల కోసం కాకుండా తనకోసం నటించిన చిత్రమిదని షారుఖ్ అన్నారు. దీన్ని బట్టి షారుక్‌కి ఈ కథ ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
► సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని, కామెడీ యాంగిల్‌లో దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెరకెక్కించడం రాజ్ కుమార్ హిరాణీ ప్రత్యేకత. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకే, సంజు..చిత్రాలే వీటికి నిదర్శనం. ఆయన కెరీర్‌లో ఇంతవరకు ప్లాప్ చిత్రమే లేదు. అందుకే డంకీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
► భారత్ నుంచి అక్రమంగా ప్రయాణించి యూకేలోకి ప్రవేశించిన స్నేహితుల కథే ఇది. ఈ చిత్రానికి తొలుత ‘రిటర్న్ టికెట్’ లేదా ‘టాస్ ’అనే టైటిల్ పెట్టాలనుకున్నారట. కానీ చివరకు డంకీ అని ఖరారు చేశారు.
► దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబీ వాళ్లు దాన్ని డంకీ అంటారు. ఈ కథ నేపథ్యం కూడా అక్రమ చొరబాటుకు సంబంధించినదే కావడంతో డంకీ సరైన టైటిల్ అని మేకర్స్ భావించారట
► ఈ మూవీ షూటింగ్ 75 రోజుల్లో పూర్తయింది. దాదాపు 60 రోజుల పాటు షారుక్ షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే దాదాపు రెండున్నరేళ్ల క్రితమే ఈ చిత్రం పనులు ప్రారభం అయ్యాయి. ప్రీప్రొడక్షన్ వర్క్ పకడ్బందీగా పూర్తి చేయడంతో షూటింగ్ త్వరగా పూర్తయిందట. ముంబై, జైపూర్, కశ్మీర్, లండన్, బుడాపెస్ట్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది.
► ఈ చిత్రం నిడివి 2.41 గంటలు. బడ్జెట్ రూ.120 కోట్లు. షారుఖ్ గత ఆరేళ్లలో నటించిన చిత్రాల్లో అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇదే.
► సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి లక్షకు పైగా అభిమానులు, వీక్షకులు రావటం విశేషం. షారూక్ సైతం లుట్ పుట్ గయా.., ఓ మాహి.. పాటలకు డాన్స్ చేసి అలరించాడు. ఈవెంట్‌లో భాగంగా అద్భుతమైన డ్రోడ్ షోను ఏర్పాటు చేశారు.
►హీరోయిన్ తాప్సికి షారుఖ్‌తో తొలి సినిమా ఇది. విక్కీ కౌశల్ అతిథి పాత్ర పోషించాడు. దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత సీనియర్ నటుడు సతీశ్ షా ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు.
►ఈ సినిమాను తొలుత డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే రోజు ప్రభాస్ సలార్ మూవీ విడుదల కానుండడంతో డంకీ ప్రీపోన్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment