(సాక్షి, వెబ్‌డెస్క్): కరోనా కాలంలో మానవత్వం చాటుకుంటూ ‘రియల్ హీరో’గా నీరాజనాలు అందుకుంటున్నారు ‘రీల్ విలన్’ సోనూసూద్. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందుల పాలైన వలస కార్మికుల పాలిట దేవుడిలా మారి వారిని సొంత ఖర్చుతో స్వస్థలాలకు చేర్చారు. ‘నిసర్గ’తుఫాను బాధితులకు అండగా నిలిచి పెద్ద మనసు చాటుకున్నారు. లాక్‌డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయిన వారికి మార్గం చూపేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా తయారు చేయించారు. ఇలా ప్రతీ ఒక్కరికి తన వంతు సాయం చేస్తూ ముందుకు సాగుతున్న సోనూను ‘అపర కర్ణుడు ’అంటూ నెటిజన్ల ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడిగా సుపరిచితుడైన సోనూసూద్ జీవితంలోని మరికొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
పంజాబీ కుటుంబం
సోనూ సూద్ స్వస్థలం పంజాబ్‌లోని మోగా. జూలై 30, 1973లో ఎగువ మధ్యతరగతి కుటుంబంలో ఆయన జన్మించారు. సోనూ తండ్రి పేరు శక్తి సాగర్ సూద్. ఆయన వ్యాపారం చేసేవారు. తల్లి సరోజ్ సూద్ ఉపాధ్యాయిని. సోనూకి ఓ సోదరి కూడా ఉంది. తన పేరు మోనికా సూద్. ఆమె సైంటిస్టుగా పనిచేస్తున్నారు.
మొదటి సంపాదన రూ. 500
స్కూల్‌లో చదివే రోజుల్లో సోనూ తన తండ్రి షోరూంలో పని చేసేవారు. బడి నుంచి రాగానే షాపులో కూర్చునేవారు. ఇక ఉన్నత విద్య కోసం మహారాష్ట్రకు వెళ్లిన సోనూసూద్.. నాగ్‌పూర్‌లోని యశ్వంత్రో చవాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్‌లో పట్టా పుచ్చుకున్నారు. ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న సమయంలో మోడలింగ్ దిశగా అడుగులు వేసిన ఆయన.. తొలి సంపాదన 500 రూపాయలు. దాంతో సోనూ డెనిమ్ దుస్తులు కొనుగోలు చేశారు.(సోనూసూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?)
ముంబైకి వచ్చిన తర్వాత
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సోనూసూద్‌కు ముంబైకి షిఫ్ట్ అయ్యారు. స్నేహితులతో కలిసి అక్కడే ఓ చిన్న గదిలో ఉండేవారు. దక్షిణ ముంబైలోని ఓ ప్రైవేటు సంస్థలో కొన్నాళ్లు పనిచేసిన సోనూ.. ఫీల్డ్ వర్క్ కారణంగా తరచుగా ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. అప్పుడు ఆయన జీతం రూ. 4500. దీంతో మంత్లీ ట్రెయిన్ పాస్ తీసుకుని ఖర్చు తగ్గించుకునే మార్గాన్ని ఎన్నుకున్నారు. అలా రైలు ప్రయాణంలో ఉండే కష్టనష్టాల గురించి సోనూకి అప్పుడే అనుభవంలోకి వచ్చింది.(‘సాఫ్ట్‌వేర్ శారద’కు సోనూసూద్ జాబ్)
టాప్-5లో ఒకడిగా..
చాలీచాలని జీతంతో నెట్టుకొస్తూనే సోనూ సూద్ మోడలింగ్ కెరీర్‌పై దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక ‘గ్రాసిం మిస్టర్ ఇండియా’ పోటీలో పాల్గొని టాప్-5లో స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు.
ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలు
సోనూసూద్‌ది ప్రేమ వివాహం. ఆయన భార్య పేరు సొనాలీ సూద్. 1996లో వీరి పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు కుమారులు అయాన్, ఇషాన్ ఉన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. సొనాలి ఉద్యోగం చేస్తూ భర్తకు అండగా నిలబడ్డారు. మీడియా ముందుకు రావడానికి పెద్దగా ఇష్టపడి ఆమె.. భర్త చేసే ప్రతి పనిలోనూ వెన్నంటే ఉంటారు. సోనూ చేస్తున్న దానధర్మాల వెనుక సొనాలి పాత్ర కూడా ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
తమిళ సినిమాతో ఎంట్రీ
ఇక సోనూసూద్ సినీ జీవితానికి వస్తే.. 1999లో కలాగర్ అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘షాహీద్ ఈ ఆజం’ మూవీతో 2002లో హిందీ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సోనూ నటించిన యువ సినిమా తనకెంతగానో గుర్తింపు తీసుకువచ్చింది. ఇక తెలుగులో సోనూ నటించిన అరుంధతి సినిమా ఆయనకు ఎంతటి క్రేజ్ తెచ్చిందో ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. పశుపతి పాత్రలో జీవించినందుకు గానూ అనేక అవార్డులు సోనూసూద్ సొంతమయ్యాయి. శక్తి, అశోక్, ఏక్ నిరంజన్, దబాంగ్, ఆషిక్ బనాయా అప్నే వంటి సినిమాల్లో కూడా సోనూ చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అంతేకాదు.. 2016లో షువాజంగ్ అనే సినిమాతో చైనీస్ చిత్రసీమలోనూ అడుగుపెట్టారు. ఇక కుంగ్ ఫూ యోగా సినిమాలో నటించిన సోనూకు.. హాలీవుడ్ యాక్టర్ జాకీ చాన్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. సినిమాలతో పాటు పలు కమర్షియల్ యాడ్స్‌లోనూ సోనూ తళుక్కుమన్నారు. అదే విధంగా తండ్రి పేరు మీదుగా శక్తి సాగర్ ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పాడు.
నో స్మోకింగ్.. పక్కా వెజిటేరియన్
సోనూ సూద్‌కు మద్యపానం అలవాటు లేదు. అదే విధంగా ఆయన స్మోకింగ్‌కు కూడా దూరం ఉంటారు. పక్కా వెజిటేరియన్. కిక్ బాక్సింగ్ అంటే ఇష్టం. గిటార్ కూడా వాయిస్తారు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే సోనూ.. పలు మ్యాగజీన్ కవర్లపై కూడా దర్శనమిచ్చారు. సోనూసూద్ వినాయకుడి భక్తుడు. అయితే తన తల్లి చనిపోయిన తర్వాత అంటే గత నాలుగేళ్లుగా ఆయన ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇక సోనూకు మూగజీవాలపై కూడా ప్రేమ ఎక్కువే. ఆయన దగ్గర ‘స్నోయీ’ అనే కుక్క ఉంది. (దారి చూపే దేవత నువ్వు: సోనూసూద్)
లగ్జరీ కార్లంటే మక్కువ
సోనూసూద్‌కు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఆయన దగ్గర పోర్షే, ఆడి క్యూ 7 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఒకరోజు తన స్నేహితుడు అజయ్ ధర్మతో కలిసి ఆడి కారులో ప్రయాణిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ వాళ్లిద్దరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇక సోనూసూద్ సినీ జీవితంలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. లేడీ డైరెక్టర్‌తో పనిచేయడం ఇష్టం లేకే మణికర్ణిక సినిమా నుంచి తప్పుకున్నారని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఆయనపై ఆరోపణలు గుప్పించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్లే తాను వైదొలిగినట్లు సోనూ సన్నిహితులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment