
మిలుకూరి గంగవ్వ, అరవై ఏళ్ల గంగవ్వ, వ్యవసాయ కూలీ గంగవ్వ... ఉన్నట్లుండి యూ ట్యూబ్ స్టార్ అయిపోయిన గంగవ్వ... ఎప్పుడో స్టార్‌గా ఎదిగిపోయింది. ఇప్పుడు తాజాగా దేశం గుర్తించిన యూ ట్యూబ్ స్టార్ అయింది. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ మీడియా మనదేశంలో ప్రభావవంతమైన, సాధికార మహిళలను గుర్తించిన క్రమంలో గంగవ్వను గుర్తు చేసుకుంది.
చదవండి: ఇంటర్య్వూలో పూజ నోట అభ్యంతరకర పదం, పట్టేసిన నెటిజన్లు
మనకు తెలిసిన మన గంగవ్వ ఇప్పుడు దేశవ్యాప్త మహిళాప్రభంజనం జాబితాలో చేరింది. నిజమే... గంగవ్వ నిజంగా ఒక ప్రభంజనం అనే చెప్పాలి. యూట్యూబ్‌లో ప్రసారమైన ‘మై విలేజ్ షో’ను గంగవ్వ కోసమే చూసిన వాళ్లున్నారు. ఆ షో చూస్తూ గంగవ్వకు అభిమానులైన వాళ్లున్నారు. ఆమెకు ఎంత ఫాలోయింగ్ అంటే... కాజల్ అగర్వాల్ వంటి సినీతారల కంటే గంగవ్వకే ఎక్కువ లైక్‌లు వచ్చేటంత.
చదవండి: ప్రభాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన శ్యామల దేవి
అందరి ఇంటి ‘అవ్వ’
గంగవ్వది తెలంగాణ రాష్ట్రం, లంబాడి పల్లి గ్రామం. పొలం పనులకు వెళ్లడం కోసం స్కూలు చదువు మధ్యలోనే ఆపేసింది. వ్యవసాయ పనులతోనే జీవితాన్ని కొనసాగించింది. ఆమెలో సహజనటి ఉందనే విషయం రెండో వ్యక్తికి కాదు తనకు కూడా తెలియకనే అరవై ఏళ్లు జీవించేసింది. ఆమె అల్లుడు తన హాస్య కథనంలో అతిథిగా కనిపించమని ఆమెను అడగడం కేవలం యాదృచ్ఛికమే. ఆ తర్వాత గంగవ్వ కెరీర్ గ్రాఫ్ అలా అలా పెరిగిపోయింది. ఇస్మార్ట్ శంకర్, మల్లేశం, లవ్‌స్టోరీ చిత్రాల్లో నటించింది. మొత్తానికి అలా మన కళ్ల ముందు ఎదిగిన మన గంగవ్వ కీర్తిపతాకం జాతీయస్థాయికి చేరింది. ‘అవ్వా! నువ్వు గ్రేట్. ఇవన్నీ ఎలా సాధించావు, నీకు భయంగా అనిపించలేదా’ అని అడిగితే ‘నీ శక్తి మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు ఏదైనా సాధించగలవు’ అంటోంది గంగవ్వ.