ముంబై: ‘‘మా నాన్న గురించి తమకు తెలుసు అని చెప్పుకొనే వారి పట్ల నేటితో గౌరవం పోయింది. అయితే ఒక్కటి మాత్రం నిజం నా కంటే మా నాన్న అన్ని విషయాల్లో బెటరే. మీ ద్వేషం కారణంగా నాకు ఈరోజు లిబరేషన్ అంటే ఏమిటో అర్థమైంది. అయినా మీరేం చేయలేరు. అయితే ఓ వ్యక్తి గురించి వెంటనే జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. అన్నట్లు మీ నాన్న కూడా నిన్ను చూసి సిగ్గుపడుతారు. కాబట్టి నోరు మూసుకో. నేను, బాబా బెస్ట్‌ఫ్రెండ్స్. మా నాన్న ఏం చేసేవారో చెప్పడానికి అస్సలు ప్రయత్నించకండి. ఆయన నమ్మకాల గురించి తెలియకుండా మాట్లాడవద్దు’’ అంటూ బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ ట్రోల్స్‌పై మండిపడ్డాడు. తన తండ్రి గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదని చురకలు అంటించాడు. దర్శక- నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు మద్దతుగా నిలిచినందుకు తనను విమర్శించిన వాళ్లకు ఈ విధంగా సమాధానమిచ్చాడు. (చదవండి: ఇది మహిళల కోసం నిలబడే సమయం: పాయల్ )
కాగా నటి పాయల్ ఘోష్ అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఆయన మాజీ భార్యలు ఆర్తీ బజాజ్, కల్కి కొచ్లిన్ సహా తాప్సీ వంటి సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. పాయల్ చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ అనురాగ్‌కు అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో బాబిల్ ఖాన్ సైతం ఇదే బాటలో నడిచాడు. అంతేగాక ఎంతో గొప్పదైన మీటూ ఉద్యమాన్ని దుర్వినియోగం చేయడం వల్ల, నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఓ వ్యక్తిపై నిందలు వేయడం సులువేనని, అయితే నిజాన్ని నిరూపించడం కష్టమని చెప్పుకొచ్చాడు. (చదవండి: మీ టూ: అనురాగ్‌కు మాజీ భార్య మద్దతు )
అంతేగాక మీటూ అంటూ కొంతమంది చేసే నిరాధార ఆరోపణల వల్ల లైంగిక వేధింపుల బాధితులపై నమ్మకం పోయే అవకాశం ఉందని, అలాంటి వాళ్లు ఎప్పటికీ చీకట్లోనే మగ్గిపోవాల్సిన దుస్థితి కలుగుతుందంటూ.. ‘‘చిన్ అప్ అనురాగ్ సర్’’అని ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘మీరన్నట్లు ఒకరిపై అభాండాలు వేయడం తేలికే కావొచ్చు. ఇన్ని విషయాలు తెలిసిన వాళ్లు, ఎదుటి వ్యక్తి చెప్పేది కచ్చితంగా అబద్ధమేననే స్టాంఢ్ తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్. ఒకవేళ ఆ అమ్మాయి చెప్పేది నిజమే అయితే అప్పుడు ఏం చేస్తారు. మీ నాన్న ఉంటే నిజంగా సిగ్గుపడేవారు. ఆయనలా బతికేందుకు ప్రయత్నించు’’అంటూ బాబిల్‌ను విమర్శించారు. దీంతో తన జడ్జిమెంట్‌పై తనకు నమ్మకం ఉందని, ఒకవేళ ఇది తప్పని తేలితే అందుకు బాధ్యత వహిస్తానని బాబిల్ చెప్పుకొచ్చాడు. కాగా ఇర్పాన్ ఖాన్- సుతాపా సికిందర్ దంపతులకు బాబిల్ ఖాన్. ఆర్యన్ అనే ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment