కమెడియన్స్ తెర వెనుక పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. కెమెరా ముందు నవ్వుతూ నవ్వించే ప్రయత్నం చేస్తున్నా నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా లేడీ గెటప్‌లు వేసి నవ్వించేవారి బాధలు అన్నీఇన్నీ కావు. అమ్మాయిలా చీర కట్టుకున్నందుకు వారిని సూటిపోటి మాటలతో వేధిస్తుంటారు. కొందరు మాత్రం తమలో ఉన్న ఆడతనాన్ని అర్థం చేసుకుని అచ్చమైన మహిళగా మారిపోతారు. ఆ జాబితాలోకే వస్తుంది ప్రియాంక సింగ్.
మెడిసిన్‌లో సీటు వదిలేసి
సాయితేజగా పరిచయమైన ఆమె తర్వాతి కాలంలో సర్జరీ చేయించుకుని ప్రియాంకగా మారిపోయింది. ఆ మధ్య బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది. ఇదిలా ఉంటే జబర్దస్త్‌లోని మరో లేడీ కంటెస్టెంట్ సాయిలేఖ కూడా ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయిందంటూ చాలాకాలంగా ఓ వార్త వైరలవుతోంది. తాజాగా ఈ పుకారుపై సాయి స్పందించాడు. అలాగే తన వ్యక్తిగత విషయాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. సాయి మాట్లాడుతూ.. 'నా అసలు పేరు వెంకటసాయిప్రసన్న కుమార్. ఇంటర్ అయిపోయాక మెడిసిన్‌లో ర్యాంక్ వచ్చింది. ఓసారి ఈవెంట్‌కు వచ్చినప్పుడు హైపర్ ఆది అన్నవాళ్లు నువ్వు కూడా యాక్టింగ్ చేయొచ్చు కదా.. సెలబ్రిటీ అయిపోతే నీతో కూడా ఫోటోలు దిగుతారు అని చెప్పాడు.
నాన్న చాలా బాధపడ్డాడు
అప్పుడు నేను హైదరాబాద్‌కు వచ్చి రెండు, మూడు ఎపిసోడ్లు చేసి తిరిగి కాలేజీకి వెళ్లిపోయాను. కానీ అక్కడున్నవాళ్లు అప్పుడే అయిపోయిందా? అని హేళన చేశారు. ఆ మాటలు తట్టుకోలేకపోయాను. కష్టమైనా, ఏదైనా సరే అని కామెడీ షోలో రీఎంట్రీ ఇచ్చి అక్కడే కొనసాగుతున్నాను. మొదట్లో మా నాన్న చాలా బాధపడ్డాడు. డాక్టర్ చదవాల్సినవాడు చీర కట్టుకుని మేకప్ వేసుకుని జబర్దస్త్‌లో చేస్తున్నాడు, మీకేం అనిపించట్లేదా? అని ఇరుగుపొరుగువారు మా నాన్నను సూటిపోటి మాటలనేవారు. అప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారో నాకు తర్వాత అర్థమైంది.
సర్జరీ చేయించుకుంటేనే అమ్మాయా?
నేను సర్జరీ చేసుకున్నానా? అని అడుగుతున్నారు. సర్జరీ చేయించుకుంటేనే అమ్మాయిలాగా ఉంటారు, లేదంటే ఉండరు అని కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ చీర నేను కట్టుకుంటేనే అందంగా కనిపిస్తాను అనిపించేది. ఇలాంటి ఆలోచనలు నాకు ఊహ తెలిసినప్పటినుంచే మొదలయ్యాయి. ఎదుటివాళ్లు ఎలా అనుకుంటారన్నది నాకు అనవసరం. నేను ఎలా ఉంటే వాళ్లకేంటి? సర్జరీ చేయించుకోవాలని కాదు. కానీ నాకు నచ్చినట్లు బతుకుతున్నాను.
డాక్టర్ కాళ్లు పట్టుకున్నాడు
ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు నాకు వంశీ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఓ రోజు నాకు రాత్రి ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లిపోయాను. అప్పుడు వంశీయే ఆస్పత్రిలో జాయిన్ చేశాడు. నేను బతుకుతానో, లేదో కష్టమని..ముందు సంతకం పెట్టాకే చికిత్స ప్రారంభిస్తామన్నాడు డాక్టర్. అతడు మా ఇంటికి ఫోన్ చేసి మా వాళ్లకు ఒకమాట చెప్పి సంతకం చేసి డాక్టర్ కాళ్లు పట్టుకున్నాడు. అతడి దగ్గర ఉన్న రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాకే ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. ఆరోజు ఆయన అలా సాయం చేయకపోయుంటే ఈరోజు సాయిలేఖ ఉండేదే కాదు. తనంటే నాకు నిజంగానే చాలా ఇష్టం' అని అని చెప్తూ ఎమోషనలయ్యాడు సాయి.
Comments
Please login to add a commentAdd a comment