ఆనందం సినిమాతో తెలుగులో గుర్తిపు తెచ్చుకున్న హీరో జైఆకాశ్ ద్విపాత్రాభినయం చేసిన తమిళ చిత్రం యోగ్యన్. మూన్ స్టార్ పిక్చర్స్ పతాకంపై మాదేశ్ నిర్మించిన ఈ చిత్రంలో కవిత, ఆర్తి, ఖుషీ హీరోయిన్లుగా నటించారు. జైఆకాశ్ శిష్యుడు సాయిప్రభా మీనా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి జూపిన్ సంగీతాన్ని, పాల్‌పాండి ఛాయాగ్రహణం అందించారు. ఇందులో జైఆకాశ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. చెడ్డవాడైన తండ్రికి పుట్టిన కొడుకు ఎలా మారతాడన్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శక్రవారం తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం చైన్నె, వడపళనిలోని శిఖరం ఆవరణలో చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో జైఆకాశ్ మాట్లాడుతూ విలన్ పాత్రలో నటించాలన్నది తన చిరకాల కల అని అది ఈ చిత్రంతో నెరవేరిందన్నాడు. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా నటించడానికి చాలా కసరత్తులు చేశానన్నాడు. సినిమా బాగా వచ్చిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడం ఎంతకష్టంగా మారిందో తెలిసిందేనని పేర్కొన్నాడు. చాలా తక్కువ థియేటర్లే తమకు దొరికాయని, దీంతో యోగ్యన్ చిత్రాన్ని థియేటర్లతో పాటు ఏకకాలంలో ఓటీటీలోనూ విడుదల చేయనున్నట్లు చెప్పాడు.
ఇందుకోసం ఏ క్యూబ్ మూవీస్ అనే సరికొత్త ఓటీటీ యాప్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ఓటీటీలో రోజుకు రూ.50 చెల్లిస్తే ఫోన్‌లోనూ, టీవీల్లోనూ ఒక రోజంతా చూడవచ్చునని చెప్పారు. ఓటీటీలో తమ చిత్రాలతో పాటు ఇతర చిత్రాలను విడుదల చేస్తామని చెప్పారు. చిన్న నిర్మాతలకు, చిన్న నటీనటుల చిత్రాలకు ఈ ఓటీటీ చాలా హెల్ప్ అవుతుందన్నారు. అదేవిధంగా ఇతర చిత్రాల నిర్మాతలకు ఏ క్యూబ్ మూవీస్ యాప్‌లో విడుదల చేస్తే వచ్చే ఆదాయంలో 80 శాతం వాళ్లకు, 20 శాతం తమ సంస్థకు చేరుతుందని జైఆకాశ్ తెలిపారు.
చదవండి: కార్తీ సినిమాకు గ్రీన్ సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment