అవార్డులు కొల్లగొట్టిన మూవీ.. మూడేళ్లయినా ఎవరూ పట్టించుకోవట్లే! | Jhini Bini Chadariya Not Able to Get OTT Platform | Sakshi
Sakshi News home page

అవార్డులు అందుకున్న సినిమా.. మాకొద్దంటున్న ఓటీటీలు

Published Thu, Jun 27 2024 12:17 PM | Last Updated on Thu, Jun 27 2024 1:05 PM

Jhini Bini Chadariya Not Able to Get OTT Platform

థియేటర్‌లో రిలీజయ్యే పెద్ద సినిమాలతో పాటు చిన్నాచితకా చిత్రాలు కూడా ఈ రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అవార్డు గెలుచుకున్న సినిమాలైతే బాక్సాఫీస్‌ రిజల్ట్‌తో సంబంధం లేకుండా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. కానీ తన సినిమాను మాత్రం ఎవరూ పట్టించుకోలేదంటున్నాడు దర్శకరచయిత రితేశ్‌ శర్మ.

వారణాసి నేపథ్యంలో మూవీ..
రితేశ్‌ తొలిసారి డైరెక్ట్‌ చేసిన చిత్రం జీనీ బీనీ చడారియా (ద బ్రిటిల్‌ థ్రెడ్‌). మేఘ మాథుర్‌, ముజఫర్‌ ఖాన్‌, శివన్‌ స్పెక్టర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా వారణాసి నగరం, అక్కడి సాంప్రదాయాలు, జీవన శైలి ఆధారంగా తెరకెక్కింది. కొన్ని పరిస్థితుల వల్ల రెండు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకున్నాయన్నది చూపించారు. 2021 నుంచి జాతీయ, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఇంతవరకు అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజవనేలేదు.

రిజెక్ట్‌ చేస్తున్న ఓటీటీ
ఈ మూవీని విడుదల చేసేందుకు ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకు రావడం లేదు. కనీసం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయినా తీసుకుందా? అంటే అదీ లేదు. ఈ క్రమంలో దర్శకుడు రితేశ్‌ శర్మ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. జీనీ బీనీ చడారియాను కొనేందుకు ఏ ఓటీటీ ఆసక్తి చూపించడం లేదు. ఇది నేను ఊహించిందే!  రాజకీయాలతో ముడిపడి ఉన్న సినిమాను కొనే సాహసం తాము చేయలేమని ఓటీటీలు చెబుతున్నాయి అని ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. సినిమాకు ఇంత గడ్డు పరిస్థితి రావడం బాధాకరమని కామెంట్లు చేస్తున్నారు.

అవార్డులు..
కాగా జీనీ బీనీ చడారియా.. న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ (2022)లో బెస్ట్‌ డెబ్యూ ఫీచర్‌ ఫిలిం, ఇండోగ్మ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ (సుప్రియ దాస్‌గుప్తా), ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ అహ్మద్‌నగర్‌లో ఉత్తమ నటి (మేఘ మాథుర్‌), ఉత్తమ ఎడిటర్‌ (భీష్మ ప్రతిం) అవార్డులు గెలుచుకుంది. ఇవే కాక మరెన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం శోచనీయం.

 

 

చదవండి: 'కల్కి' గెస్ట్‌ రోల్స్‌లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement