నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాల్లో నటించి మెప్పించారు.భయపెట్టే విలనిజం నుంచి కరుణ రసం, కామెడీ పాత్రల్లో సైతం తన నటనతో మెప్పించిన నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. యముడు అంటే బహుశా ఇయనలాగే ఉంటారేమో అనేంతలా కెరీర్‌లో పదుల సంఖ్యలో యముడి పాత్రలు పోషించి భళా అనిపించారు. యముండ అంటూ ఆయన గర్జించే గర్జన ఇప్పటికీ మరువలేనిది. యముడి పాత్రలో కైకాలను తప్ప మరొకరిని ఊహించుకోలేము అనేంతగా తన నటనతో కట్టిపడేశారు. యముడి పాత్రల్లో కైకాల నటించిన సినిమాలను ఓసారి గుర్తుచేసుకుందాం..
1977లో వచ్చిన యమగోల సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో ఎన్టీఆర్‌కు ఎంత పేరు వచ్చిందో యముడిగా కైకాల సత్యనారాయణకు కూడా అంతటి పేరు వచ్చింది. 1998లో వచ్చిన యముడికి మొగుడు అనే సినిమాలో కైకాల పోషించిన యముడు పాత్ర మరువలేనిది. ఆయుష్షు తీరకుండానే యమలోకానికి వెళ్లిన చిరు యముడికి చుక్కలు చూపించే సన్నివేశాలు జనాలను ఎంతో ఆకట్టుకున్నాయి.
ఇక ఎస్వీ క్రిష్ణారెడ్డి తెరకెక్కించిన యమలీలలో కూడా కైకాల పాత్ర అత్యద్భుతం. కమెడియన్ అలీ హీరోగా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. అలాగే యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో కూడా యుముడిగా ఆకట్టుకున్నారు. ఇక తొట్టెంపూడి వేణు, శ్రీకాంత్ హీరోలుగా నటించిన యమగోల మళ్లీ మొదలైందిలోనూ రిటైర్డ్ అయ్యే యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ కనిపించారు. చివరగా ఆయన రవితేజ నటించిన 'దరువు' చిత్రంలోనూ యముడి పాత్రలో మెప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment