కమలహాసన్, అజిత్ భరతనాట్యానికి ద్రోహం చేశారని నటుడు, దర్శక నిర్మాత సాయి శ్రీరామ్ తీవ్రంగా ఆరోపించారు. ప్రముఖ భరతనాట్య కళాకారి అయిన ఈయన 30 ఏళ్లుగా ఆ కళామతల్లికి సేవలందిస్తున్నారు. తాజాగా భరతనాట్యం ఇతివృత్తంతో 'కుమారసంభవం' చిత్రాన్ని రూపొందించారు. దీనికి ఇతడే కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, నృత్యం, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు చేపట్టి కథానాయకుడిగా నటించడం విశేషం. ఈ చిత్రంలో నిఖితా మీనన్, సాయి అక్షిత, మీనాక్షి అనే ముగ్గురు కథానాయికలుగా నటించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా సాయి శ్రీరామ్ గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు తన తండ్రి పీకే.ముత్తు కూడా భరత నాట్య కళాకారుడని తెలిపారు. ఆయన కొన్ని చిత్రాలకు నృత్య దర్శకుడిగానూ పని చేశారన్నారు. అయితే కొన్నేళ్లుగా భరత నాట్య కళను కించపరిచే విధంగా సినిమాలు చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు వరలారు చిత్రంలో నటుడు అజిత్ భరతనాట్యం నేర్చుకోవడం వల్లే తనకు వివాహం కాలేదని పేర్కొన్నారు. అదేవిధంగా నటుడు కమల్ హాసన్ భరతనాట్య కళాకారుడు కావడం వల్లే భార్య ఆయన్ని వదిలి వెళ్లిపోయినట్లు చిత్రీకరించారన్నారు. అలా భరత నాట్య కళాకారుడిని పెళ్లి చేసుకోవడానికి యువతులు ముందుకు రారనే తప్పుడు సంకేతాలను చిత్రాల ద్వారా కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అపోహలను పోగొట్టడానికే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment