
తమిళసినిమా: ఇటీవల విక్రమ్ చిత్రంతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు కమలహాసన్. ప్రస్తుతం ఇండియన్-2 చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఈయన కలల చిత్రం మరుదనాయగన్. దీన్ని 1997లో ఆర్భాటంగా ప్రారంభించారు. ఆయన టైటిల్ పాత్రను పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ విచ్చేశారు. అదే విధంగా అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, శివాజీగణేశన్ వంటి వారు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
చిత్ర షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యింది. అయితే బడ్జెట్ తదితర కారణాల వల్ల ఆపై షూటింగ్ కొనసాగలేదు. అయితే మరుదనాయగన్ చిత్రాన్ని పూర్తి చేస్తానని కమలహాసన్ చాలా సార్లు చెప్పారు. దీనికి హాలీవుడ్ నిర్మాతలు నిర్మాణంలో భాగం పంచుకుంటారని కూడా చెప్పారు. అయితే అవేవీ ఇప్పుటి వరకూ జరగలేదు. అలాంటిది సుమారు 26 ఏళ్ల తరువాత ఇప్పుడు మరుదనాయగన్ చిత్రాన్ని బూజు దులపడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రం అప్పుట్లో 40 నిమిషాల నిడివి పూర్తి అయ్యింది.
కాగా ఇప్పుడు కమలహాసన్ పాత్రలో నటుడు విక్రమ్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే గతంలో కమలహాసన్ నటించిన సన్నివేశాలు చిత్రంలో చోటు చేసుకునేలా కథనాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఇటీవల బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ వంటి చారిత్రక కథా చిత్రాలు అమోఘ విజయం సాధించడంతో కమలహాసన్‌కు మరుదనాయగన్ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలనే ఆలోచన కలిగినట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment