కన్నడ హీరో దర్శన్ ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. ఆయనతో పాటు వేలాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన బెయిలు దక్కలేదు. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, నటి పవిత్రగౌడ బెయిల్ పిటిషన్‌ను నగర 57 వ సీసీహెచ్ కోర్టు కొట్టివేసింది. బెయిల్ వస్తుందనే ఆశతో ఉన్న ఇరువురు తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు.
బెయిల్ పిటిషన్ మీద ప్రభుత్వ వకీలు ప్రసన్నకుమార్, దర్శన్ న్యాయవాది సీవీ.నాగేశ్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. బెయిలు ఇవ్వరాదని ప్రభుత్వ వకీలు, ఇవ్వాలని దర్శన్ ప్లీడరు వాదించారు. గత కొన్ని రోజులుగా బెయిలు అర్జీపై వాదనలు సాగుతున్నాయి. జడ్జి జైశంకర్ తీర్పు వెలువరిస్తూ బెయిలు ఇవ్వడం లేదని ప్రకటించారు. కానీ, ఇదే కేసులో రవిశంకర్, దీపక్ అనే ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
జూన్ 10 నుంచి జైలువాసం
దర్శన్, పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. ఇటీవల సిట్ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్‌జైల్‌లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment