అప్పుల బాధలు, భార్యకు దూరం కావడంతో సినీ దర్శకుడు మృతి | Kannada Director Guru Died By Commtting Suicide, Death Reasons Inside | Sakshi
Sakshi News home page

Director Guru Prasad Death: అప్పుల బాధలతో పాటు భార్యకు దూరం కావడంతో సినీ దర్శకుడు మృతి

Published Mon, Nov 4 2024 7:44 AM | Last Updated on Mon, Nov 4 2024 10:27 AM

Kannada Director guru Prasad Passed Away This Reason

కన్నడ ప్రముఖ దర్శకుడు గురుప్రసాద్ ఆత్మహత్యకు కారణాలు వెలుగులోకి వచ్చాయి.  సినిమా రంగంలో నటీనటులు, దర్శకులు బాగా డబ్బుతో ఏ కష్టం లేకుండా జీవిస్తుంటారని అనుకుంటారు. కానీ, ఆయన మరణం వెనుక ఆర్థిక ఇబ్బందులే కారణం అని తెలుస్తోంది. బెంగళూరు రూరల్‌ నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న గురుప్రసాద్‌ (52) మూడు రోజుల క్రితం ఉరివేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన పూర్తిపేరు గురుప్రసాద్‌ రాఘవేంద్ర శర్మ, కనకపుర స్వస్థలం. సినిమాలపై మోజుతో ఆ రంగంలోకి వచ్చి దర్శకుడయ్యారు. సామాజిక అంశాలను బాగా చిత్రీకరించేవారు.

రెండవ పెళ్లీ విఫలం..
మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గురుప్రసాద్‌ ఇటీవలే రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు కూడా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. మరోవైపు అవకాశాలు లేని గురుప్రసాద్‌ అప్పులపాలయ్యారు. తాగుడుకి బానిసైన ఆయన అప్పులు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నేను ఆత్మహత్య చేసుకుంటానని సన్నిహితుల వద్ద చెప్పేవాడని తెలిసింది. ఇటీవల ఆయన డైరెక్ట్‌ చేసిన రంగనాయక సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. షూటింగ్‌ ముగిసినా ఓ సినిమా విడుదల కాలేదు. కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లోనూ నటించారు.

అప్పుల బాధల వల్ల తరచూ ఇళ్లు మారుస్తూ.. 
సినిమాల కోసం గురుప్రసాద్‌ రూ.3 కోట్ల వరకూ అప్పులు చేశారు. అప్పులు ఇచ్చిన ఫైనాన్షియర్‌లు తరచూ ఒత్తిడి చేసేవారు. ఆ బాధ పడలేక ఆయన తరచూ ఇళ్లు మారుస్తూ వచ్చాడు. కొందరు రుణదాతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. చెక్‌ బౌన్స్‌ కేసులో ఒకసారి అరెస్టయ్యారు. అయితే ఆయన తీసిన మఠ, ఎద్దేళు మంజునాథ్‌, డైరెక్టర్‌ స్పెషల్‌ తదితర చిత్రాలు విజయం సాధించడంతోపాటు మంచి పేరు, అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆదివారం అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నుండి దుర్గంధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా గురుప్రసాద్‌ శవం కుళ్లిపోయి ఫ్యాన్‌కు వేలాడుతోంది. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.

ముగిసిన అంత్యక్రియలు
చిత్ర దర్శకుడు గురుప్రసాద్‌ అంత్యక్రియలు  ఆదివారం సాయంత్రం జరిగాయి. బ్రాహ్మణ విధివిధానాల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. గురుప్రసాద్‌ సోదరుడు హరిప్రసాద్‌, మొదటి భార్య ఆరతి, రెండో భార్య సుమిత్ర, ఇతర కుటుంబ సభ్యులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు యోగరాజ్‌భట్‌, నటుడు దునియా విజయ్‌, డాలి ధనంజయ, తబలా నాణి, సతీశ్‌ నీనాసం తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కాగా, తన భర్త మృతి పట్ల తనకు ఎలాంటి అనుమానాలు లేవని, అప్పుల బాధ ఎక్కువై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భార్య సుమిత్ర పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అనుమానస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement