హత్య కేసులో శాండల్‌వుడ్ హీరో దర్శన్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున ఆర్‌ఆర్‌నగర్‌లోని ఆయన నివాసంలో కామాక్షిపాళ్య పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు రేణుకాస్వామిని హత్య చేశారు. నటుడు దర్శన్ సూచనల మేరకే ఈ హత్య జరిగినట్లు సమాచారం. ఈ ఉదంతం సంచలనం సృష్టించింది.
రెండు రోజుల క్రితం కర్ణాటకలోని సుమన్నహళ్లి బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన నేపథ్యంలో కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మృతుడు, చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిగా గుర్తించారు. ఈ హత్య కేసులో దర్శన్‌కు సంబంధం ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ దయానంద్ ప్రకటించారు. ఈ విషయమై మరికాసేపట్లో కమిషనర్ దయానంద్ విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.
ఈ ఘటన జూన్ 9న జరిగింది. రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకొచ్చి. వినయ్‌కు చెందిన షెడ్డులో ఉంచారు. ఆ సమయంలో రేణుకా స్వామిపై నలుగురు కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ టీమ్‌లో దర్శన్ ఉన్నట్లు సమాచారం. రేణుకా స్వామి మరణించాక మృతదేహాన్ని ఒక కల్వర్టులో పడేశారు. దర్శన్ సూచన మేరకే హత్య చేసినట్లు నలుగురు నిందితులు పోలీసులు వద్ద అంగీకరించారని సమాచారం.
కారణం ఇదేనా..?
కన్నడ నటి పవిత్ర గౌడతో దర్శన్‌కు సంబంధం ఉందని గతంలో పుకార్లు వ్యాపించాయి. ఆయనతో సంబంధం ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వివాదాస్పద పోస్ట్ కూడా ఆమె చేసింది. దీంతో పవిత్ర గౌడపై దర్శన్ భార్య విజయ లక్ష్మి విమర్శలు గుప్పించింది. కొద్ది నెలల క్రితం ఈ వివాదం భారీగానే జరిగింది. అయితే, నటి పవిత్ర గౌడపై రేణుకా స్వామి కూడా సోషల్ మీడియాలో కొన్ని కించపరిచే పోస్ట్‌లు చేశారని తెలుస్తోంది. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే హత్య జరిగినట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంత సమయంలో మీడియా సమావేశం ద్వారా పోలీసులు వివరాలు తెలపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment