![Kannappa: Manchu vishnu Shares Mohanlal, Prabhas Remuneration Details](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/kannappa.jpg.webp?itok=vqHze1oP)
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’(Kannappa). అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించిన ఈమూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ని ముమ్మరం చేశారు మేకర్స్. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక అప్‌డేట్ ఇస్తున్నారు. దీంతో పాటు మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఈ సినిమా కోసం ఏడేళ్లుగా పని చేస్తున్నామని, దాదాపు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించామని చెప్పాడు. ఇందులో నటీనటులు పారితోషికాలతో కలిపి చూస్తే.. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరగాల్సింది. కానీ చాలా మంది నటీనటులు డబ్బులు తీసుకోకుండానే నటించారట. మోహన్ లాల్, ప్రభాస్ అయితే ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారట. ఈ విషయాన్ని మంచు విష్ణునే చెప్పారు.
‘ఈ చిత్రంలో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohanlal) పోషించిన పాత్రలు చాలా కీలకం. వాళ్లను కథ చెప్పగానే ఒప్పుకున్నారు.ఈ సినిమా కోసం వాళ్లిద్దరూ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదు. నాన్నగారిపై(మోహన్ బాబు)పై ఉన్న అభిమానంతో వారిద్దరు నటించారు. మోహన్‌లాల్ దగ్గరకు వెళ్లి కథ చెప్పిన తర్వాత పారితోషికం గురించి మీ మేనేజర్‌తో మాట్లాడమంటారా అని అడిగితే..‘అప్పుడే అంత పెద్ద వాడివయ్యావా?’ అన్నాడు.
ఇక ప్రభాస్ నాకు మంచి స్నేహితుడు. అతని వల్ల నాకు స్నేహంపై నమ్మకం పెరిగింది. నా కోసం ప్రభాస్ ఇందులో నటించాడు. అలాగే అక్షయ్ కుమార్ పోషించిన పాత్ర కూడా కీలకమే. శివుని పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తే.. రెండు సార్లు సున్నితంగా తిరస్కరించాడు. తర్వాత వేరే దర్శకుడితో చెప్పించి ఆయనను ఒప్పించాం. చాలా అద్భుతంగా నటించాడు’ అని విష్ణు చెప్పుకొచ్చాడు.
అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్, పార్వతీదేవిగా కాజల్ నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment