కరణ్ జోహార్ సాధించిన ప్రతి విజయం వెనుక తన కృషితోపాటు ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. బాలీవుడ్‌లో రెండున్నర దశాబ్దాలకుపైగా రాణిస్తున్నారు.దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, గత కొద్ది కాలంగా దర్శకత్వానికి స్వస్తి పలికి నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న కరణ్ తన గతాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
నాన్న మిగిల్చిన నష్టాలను నాన్నమ్మ తీర్చింది
కరణ్ జోహార్ తండ్రి యష్ జోహార్ కూడా టాప్ ప్రొడ్యూసర్ అని తెలిసిందే. 1980 సమయంలో తన తండ్రి నిర్మించిన 5 సినిమాలు వరుసుగా ఫ్లాప్ కావడంతో తన కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి తాజాగా కరణ్ మాట్లాడాడు. ఇబ్బందుల నుంచి సక్సెస్ కోసం తాను ఎంత కష్టపడ్డారో ఆయన తెలిపారు.
కరణ్ జోహార్ తండ్రి యష్ జోహార్ బాలీవుడ్‌లో దోస్తానా, అగ్నిపథ్, డూప్లికేట్, కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమాలను నిర్మించి టాప్ నిర్మాతల లిస్ట్‌లో చేరిపోయారు. అయితే, దోస్తానా (1980) తర్వాత యష్ జోహార్ నిర్మించిన 5 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ దారుణమైన నష్టాలను మిగిల్చాయి. దీంతో తన నాన్నగారు చాలా ఆస్థులను అమ్మేశారని కరణ్ తెలిపారు.
'మా నాన్నగారు మొదటి చిత్రం ఫ్లాప్ అయినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. డబ్బును ఫైనాన్సర్‌లకు తిరిగి చెల్లించడానికి మా నాన్నమ్మ తన ఇంటిని అమ్మేసి ఆ డబ్బును చెల్లించింది. ఆ తర్వాత మరో సినిమా నిర్మిస్తే అదికూడా నిరాశపరిచింది. ఆప్పుడు మా అమ్మ తన నగలను విక్రయించింది. ఆపై కుటుంబ వారసత్వంగా వస్తున్న ఢిల్లీలోని కొన్ని ఆస్తులను కూడా నాన్న అమ్మేశారు.' అని కరణ్ జోహార్ గుర్తుచేసుకున్నారు.
కరణ్ జోహార్ తండ్రి నిర్మాత అయినప్పటికీ, తమది సంపన్న కుటుంబమనే అపోహను తొలగించారు. వారిది మధ్యతరగతి, ఉన్నత-మధ్యతరగతి కుటుంబమని చెప్పారు. కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా రాకుమారుడిలా తనని పెంచారని గుర్తుచేసుకున్నారు.
కరణ్ జోహార్ అంత డబ్బు ఎలా సంపాదించాడు..?
కరణ్ జోహార్ నేడు అత్యంత సంపద కలిగిన నిర్మాతల లిస్ట్‌లో టాప్‌లో ఉంటారు. తన తండ్రి యష్ జోహార్ డబ్బు సంపాధించకపోయినప్పటికీ మంచిపేరు ఉంది. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కరణ్ ఊహించలేనంత విజయాలను సొంతం చేసుకున్నారు. కెరీర్‌లో నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి అవిశ్రాంతంగా ఎలా పనిచేశాడో ఆయన తెలిపారు. అదృష్టవశాత్తూ, దర్శకుడిగా తన మొదటి మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని ఆయన అన్నారు. తన తండ్రి మరణించిన తర్వాతే ధర్మ ప్రొడక్షన్స్ నుంచి పలు సినిమాలు నిర్మించినట్లు ఆయన అన్నారు.
జీవితంలో తను ఎంత కష్టపడ్డారో కరణ్ ఇలా చెప్పుకొచ్చారు. 'మా కుటుంబం ఆనందంగా ఉండాలని నాన్న ఎంతో కష్టపడ్డారు. కానీ, అంతగా కలిసిరాలేదు. ఆయన కలలకు నేను ఎలాగైనా జీవం పోయాలని అనుకున్నాను. ఈ క్రమంలో నేను ముందుగా దర్శకుడిగా పలు సినిమాలు తీశాను. దేవుడి ఆశీర్వాదంతో అవి సూపర్ హిట్ అయ్యాయి. చేతిలోకి సరిపడా డబ్బు వచ్చింది. నా కష్టంతో నాన్న కలను నిజం చేశాను. అందుకోసం నేను రోజుకు 18 గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆదివారం, జాతీయ సెలవు దినాలలో కూడా నేను పని చేస్తాను. నా జీవితంలో శెలవు అనే పదానికి చోటు లేదు. నేను కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్రపోతాను.' అని కరణ్ చెప్పారు.
దర్శకుడిగా కరణ్ జోహార్ చివరి చిత్రం రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ. 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అలియా భట్ నటించారు. విమర్శకుల చేత కూడా ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్18 స్టూడీయోస్ సంయుక్తంగా నిర్మించాయి.
Comments
Please login to add a commentAdd a comment