‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్‌ చేసి.. | Karthika Deepam Actress Usha Rani Latest Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఫ్రాడ్ కేసుకు లింకు.. డీఎస్పీ అంటూ ఫోన్‌ కాల్‌.. ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం!

Published Sun, Jun 16 2024 9:46 AM | Last Updated on Sun, Jun 16 2024 10:47 AM

Karthika Deepam Actress Usha Rani Latest Video Goes Viral

దేశంలో ఆన్‌లైన్‌ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. స్మార్ట్‌ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్‌లైన్‌ లావాదేవీలను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులు, బ్యాంకులు, ఇతర సంస్థలు మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రజల్లో కొంత మార్పు వచ్చింది. ఓటీపీ(వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌)వివరాలను అపరిచితులతో షేర్‌ చేసుకోవడం లేదు. దీంతో సైబర్ నేరగాళ్లు నయా పంథాను ఎంచుకుంటున్నారు. బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల పేర్లు చెప్పకుండా..ఏకంగా పోలీసుల పేర్లతో మోసానికి పాల్పడుతున్నారు. 

తాజాగా ‘కార్తీక దీపం ’సీరియల్‌ నటి ఉషా రాణి సైబర్‌ నేరగాళ్ల నుంచి తృటిలో తప్పించుకుంది. ఓ కేటుగాడు డీఎస్పీని అంటూ ఫోన్‌ చేసి ఓటీపీ వివరాలు అడిగితే.. తెలివిగా వ్యవహరించి ఆన్‌లైన్‌ మోసానికి చెక్‌ పెట్టింది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ..జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించింది. వీడియోలో ఆమె ఇలా చెప్పుకొచ్చింది.

’నాకు ఒక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంది. అందులో మొత్తం రూ.5 లక్షల వరకు షాపింగ్‌ చేసుకోవచ్చు. దానిని మా అబ్బాయి బయటకు తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టుకున్నాడు. వాడు తరచు ప్యాంట్‌ జేబులో పెట్టి మర్చిపోతుంటాడు. ఈ సారి కూడా ఎక్కడో పెట్టే ఉంటాడులే అనుకొని బ్లాక్‌ చేయకుండా వదిలేశా. ఆ కార్డు అమోజాన్‌కి లింక్‌ అయి ఉండడంతో నా షాపింగ్‌కి కూడా ఇబ్బంది కాలేదు. పని జరుగుతుంది కదా అని నేను లైట్‌ తీసుకున్నాను.

కొన్నిరోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ఒక వ్యక్తి చాలా గంభీరమైన గొంతుతో ‘నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను. మీరు ఉషారాణి కదా.. మీ నంబర్ ఒక ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉంది. ఆ కేసును క్యాన్సిల్ చేసేందుకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని షేర్ చేయండి అని అడిగాడు. అయితే నేను కాసేపు ఆలోచించాను. ఆ వెంటనే తేరుకుని అసలు ఓటీపీలు చెప్పకండి అని మీరే అంటారు కదా.. మళ్లీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు? అని అడిగాను. 

నేను ఆఫీస్ కే వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో.. అతను ఫోన్ కట్ చేశాడు. కాసేపటికి వాట్సాప్ కి ఒక బిల్లు కూడా పెట్టారు. అందులో మా ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్, అన్నీ వివరాలు ఉన్నాయి. దీంతో నేను వెంటనే అలెర్ట్ అయ్యాను. దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించాను. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాను. జాగ్రత్తగా ఉండండి.మోసపోకండి’ అని  ఉషారాణి చెప్పుకొచ్చింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement