‘‘ఒక్క అన్నయ్య ఉంటేనే గొడవపడుతుంటాం.. అలాంటిది వంద మంది అన్నయ్యలుంటే? అనే పాయింట్ ఆసక్తిగా అనిపించింది. ఈ వంద మంది రౌడీ అన్నయ్యలు ఆర్నెళ్లపాటు ఏం చేయకుండా చూసుకోవాలని నాన్న చెప్పాక నా పరిస్థితి ఏంటి? అన్నదే ‘సుల్తాన్’ కథ’’ అని హీరో కార్తీ అన్నారు. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మికా మందన్న జంటగా రూపొందిన చిత్రం ‘సుల్తాన్’. యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కార్తీ చెప్పిన విశేషాలు. బక్కియరాజ్ కణ్ణన్ ‘సుల్తాన్’ స్టోరీ లైన్ చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. రెండేళ్లు కష్టపడి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేశారాయన. తల్లితండ్రులు, పిల్లల మధ్య భావోద్వేగాలతో కూడిన సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి.. వస్తున్నాయి. కానీ వంద మంది అన్నయ్యలు, ఓ తమ్ముడి మధ్య భావోద్వేగాలు ఆసక్తికరంగా ఉంటాయి. 101 మందితో సన్నివేశాలు తెరకెక్కించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది.
ఈ సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ నటీనటులు, యూనిట్ మెంబర్స్‌తో ప్రతిరోజూ ఓ పండగ వాతావరణం ఉండేది. ఈ సినిమా నాకు కొత్త అనుభూతినిచ్చింది. ∙సినిమాలో రోబోటిక్స్ ఇంజినీర్ అయిన నేను ముంబయ్ నుంచి పల్లెకు ఎందుకొచ్చాను? ఏం చేశాను? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. బాగా చదువుకుని గ్రామీణ ప్రాంతంలో ఉంటూ ఊరిలోని వారికి సహాయం చేసే పాత్ర రష్మికది. ఈ సినిమాలో వ్యవసాయం నేపథ్యంలో కొన్ని సీన్లు ఉన్నాయి. వ్యవసాయం ఇంత కష్టంగా ఉంటుందా? అన్నారామె. బక్కియరాజ్ కణ్ణన్ ఎంతో ఓపికతో అందరి నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. ‘సుల్తాన్’కి ఓటీటీలో విడుదలకు అవకాశం వచ్చినా థియేటర్లలోనే విడుదల చేస్తున్న నిర్మాతలకు థ్యాంక్స్. ఇది ఇంట్లో కూర్చుని చూసే సినిమా కాదు. థియేటర్లోనే చూడాలి.
మంచి కథ కుదిరితే అన్నయ్య (సూర్య), నేను నటించడానికి సిద్ధం. తెలుగులో ‘ఊపిరి’ అవకాశం ఇచ్చిన నాగార్జున సార్‌కి, వంశీ పైడిపల్లిగారికి థ్యాంక్స్. మంచి కథ కుదిరితే తెలుగులో మళ్లీ డైరెక్ట్ సినిమా చేయాలని ఉంది. మణిరత్నంగారి దర్శకత్వంలో చేస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ 70శాతం పూర్తయింది. మిస్కిన్ తోనూ ఓ సినిమా చేస్తున్నాను.
లాక్‌డౌన్ తర్వాత తెలుగులో సినిమాలు బాగా ఆడుతున్నాయి.. మంచి వసూళ్లు వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీ వల్లే అన్ని ఇండస్ట్రీల వారికీ ఓ నమ్మకం వచ్చింది. నాకు తెలిసి 2022లో కోవిడ్ నేపథ్యంలో వంద సినిమాలు వస్తాయనుకుంటున్నా (నవ్వుతూ). లాక్‌డౌన్‌లో మాకు బాబు పుట్టాడు. నాకు సంప్రదాయబద్ధంగా ఉండే పేర్లంటే ఇష్టం. అందుకే బాబుకి ‘కందన్’ అని పెట్టాను. కందన్ అంటే కార్తికేయ స్వామి అని అర్థం. మా ఫ్యామిలీలో మా అందరికీ ఆయన పేరే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment