ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పలు వివాదాస్పద అంశాలతో చర్చకు తెరతీసి పాపులర్ అయిన కత్తి మహేశ్‌కు సోషల్ మీడియాలోనూ బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పలు సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీలు అయిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువు పూర్తయ్యాక ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేసిన కత్తి మహేశ్..రాఘవేంద్రరావు ప్రొడక్షన్ హౌస్‌లో ‘రాఘవేంద్ర మహత్య్మం’ సీరియల్‌కు పనిచేశారు. 2015లో పెసరట్టు అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. అయితే నటుడిగా రాణించాలనే కోరికతో హృదయ కాలేయం,కొబ్బరి మట్ట సహా కొన్ని చిత్రాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఎప్పటికైనా నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కకోవాలని అనుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన సన్నిహితులతో పాటు స్నేహితులతోనూ పదేపదే చెప్పేవారట.
అంతేకాకుండా రాజకీయాల్లోనూ రాణించాలని భావించారట. అయితే దురదృష్టవశాత్తూ యాక్టింగ్, పాలిటిక్స్..ఈ రెండింటిలోనూ ఆయన ప్రారంభ దశలో ఉండగానే అకస్మాత్తుగా కన్నుమూశారు. 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించినా అప్పుడు కుదరలేదు. మొత్తానికి నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనదైన గుర్తింపు సంపాదించాలన్న కత్తి మహేశ్..ఆ రెండు కోరికలు తీరకుండానే తుదిశ్వాస విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment