సోషల్‌మీడియా వేదికగా మలయాళ నటి హనీరోజ్‌ను (Honey Rose) ఇబ్బందులకు గురిచేసిన వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కొంత కాలంగా ఒక వ్యాపారవేత్త ఇబ్బంది పెడుతున్నాడని కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సుమారు 30మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో కీలకమైన వ్యక్తి వివరాలను తాజాగా పోలీసులు ప్రకటించారు.
హనీరోజ్‌ను ఇబ్బంది పెడుతున్న ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును ( Boby Chemmanur) సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హనీరోజ్ ఫిర్యాదు చేసిన సమయం నుంచి అతను పరారీలో ఉన్నాడు. వయనాడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.
అయితే, అంశంపై హనీరోజు కూడా స్పందించారు. అతనిని అరెస్ట్ చేయడం తనకెంతో ప్రశాంతంగా ఉందని ఆమె అన్నారు. ఈ కేసు అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ ( Pinarayi Vijayan) వద్దకు తీసుకెళ్లానని ఆమె తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరిపై తగిన చర్యలు తీసుకుంటామని సీఎం మాట ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. కొందరు తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఒక లేఖను హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని అందులో రాసుకొచ్చింది. తప్పుడు కామెంట్ల గురించి తాను సైలెంట్‌గా ఉంటుంటే.. ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తున్నావా..? అని చాలామంది అడుగుతున్నారని ఆమె తెలిపారు.
(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న సింగిల్ టేక్ హీరోయిన్.. బాలకృష్ణ సినిమాతో గుర్తింపు)
ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించాడు. పలు వ్యక్తిగత కారణాల వల్ల చాలాసార్లు నిరాకరించాను. అందుకు ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్‌కు రావడం.. వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆమె తెలిపింది. కానీ, తనపై ఎవరైనా వివరణాత్మక విమర్శలు చేస్తే స్వాగతిస్తానని ఆమె పేర్కొన్నారు. తన లుక్స్‌పై వేసే సరదా జోక్స్ కూడా తీసుకుంటానన్నారు. తనపై వచ్చిన కొన్ని మీమ్స్ కూడా సరదాగేనే ఉంటాయని అన్నారు. ఇలాంటివి తనను బాధించవని కూడా తెలిపారు. కానీ, దానికంటూ ఒక హద్దు ఉంటుందని దానిని దాటి ఇలా అసభ్యకరంగా చేసే కామెంట్స్‌ను ఏమాత్రం సహించనని హనీరోజ్ హెచ్చరించారు.
ఎవరీ బంగారు బాబీ..?
భారత్‌లో బంగారు వ్యాపారంలో బాబీ చెమనూరు ప్రముఖులుగా ఉన్నారు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ డిగో మారడోనాను కొచ్చికి తీసుకొచ్చి తన జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేశాడు. అలా ఆయన పేరు అందరికీ పరిచయమే. వ్యాపారంలో భాగంగా నటి హనీరోజ్‌ను అతను ఆహ్వానించినా పలు కారణాలతో ఆమె వెళ్లలేకపోయింది. దీంతో ఆమెను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఈ ఒక్క సినిమాతోనే 10 చిత్రాలకు దక్కినంత పేరు, గుర్తింపు ఆమె రావడం విశేషం. దీంతో తెలుగు రాష్ట్రాలలో పదుల సంఖ్యలో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు గెస్ట్‌గా వెళ్లారు. వాస్తవంగా 2008లోనే ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment